Samantha on Minister Surekha Words in Citadel Web Series Event : తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల నటి సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమంత సహా సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారం పెను దుమారానికి దారితీయడంతో ఆ తర్వాత మంత్రి సమంతకు క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి మరోసారి స్పందించారు. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనిపై మాట్లాడారు. కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై రిపోర్టర్ ప్రశ్నించగా, దానికి సమంత ఈ విధంగా సమాధానమిచ్చారు.
'ఎంతోమంది మద్దతుతో నేను ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాను. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు నాపై ఉన్న నమ్మకం, వారు నాపై చూపించే ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. వారంతా నాలో ధైర్యం నింపారు. కష్టాలను ఎదుర్కోవడంతో వారి మద్దతు నాకు ఎంతో ఉపయోగపడింది. వారంతా నా వెంట నిలబడకపోయుంటే కొన్ని పరిస్థితులను అధిగమించేందుకు నాకు చాలా సమయం పట్టేది. నా చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను' అని సమంత బదులిచ్చారు.
ఇదే సమయంలో ఆన్లైన్లో వచ్చే ట్రోలింగ్స్పైనా సమంత స్పందించారు. అలాంటి వాటి గురించి తాను ఎక్కువగా ఆలోచించనని తెలిపారు. ద్వేషపూరిత సందేశాలు స్వీకరించినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని చెప్పారు. అలాంటి మెసెజ్‌లు పంపేవారు కూడా అలాంటి బాధే అనుభవించారేమో అని ఆలోచిస్తానన్నారు.
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన 'సిటాడెల్ : హనీ బన్నిలో వరుణ్ ధావన్, సమంతలు ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో క్లైమాక్స్ సన్నివేశం హైలైట్ కానుందని సమంత వెల్లడించారు. 11 నిమిషాల ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో, అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా చిత్రీకరించినట్లు ఆమె తెలిపారు.
అది మా బలహీనత అనుకోవద్దు : రకుల్ ప్రీత్ సింగ్ - Rakul Preet Singh on Konda Comments