Manchu Manoj Tweet : తన తండ్రి ఆరోపణలు చాలా బాధ కలిగించాయని, తనపై, తన భార్య మౌనికపై దురుద్దేశపూరిత ఆరోపణలు చేశారని మంచు మనోజ్ అన్నారు. ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవాలు అని, తన పరువు తీసి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగమే అని పేర్కొన్నారు. సోమవారం మనోజ్, ఆయన భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్, మౌనిక తన ఇంటిని ఆక్రమించి, సిబ్బందిని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇల్లు స్వాధీనానికి మనోజ్, మౌనిక ప్లాన్ చేశారని మోహన్‌బాబు ఆరోపించారు. తాజాగా దీనిపై స్పందించిన మంచు మనోజ్.. మోహన్‌బాబు ఆరోపణలకు వివరణ ఇస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
తనపై, తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, తాము స్వయం ఉపాధి పొందుతూ స్వతంత్రంగా ఉన్నామని ఎక్స్ వేదికగా మంచు మనోజ్ తెలిపారు. తానెప్పుడూ ఆర్థిక సాయం కోసం తన కుటుంబంపై ఆధారపడలేదని, తాను ఏడాది నుంచి తన నాన్న ఇంట్లో ఉంటున్నానని వివరించారు. తన సోదరుడు దుబాయ్ వెళ్లాక తన అమ్మ ఒంటరిగా ఉందని, తనను ఇంటికి రమ్మని తన నాన్న పిలిచారని చెప్పారు. 4 నెలల క్రితం దురుద్దేశపూర్వకంగా వెళ్లానని ఆరోపించారని మనోజ్ పేర్కొన్నారు. తనను, తన భార్యను ఇరికించే ఉద్దేశంతో ఫిర్యాదు చేశారని తెలిపారు.
My humble request to serve justice through a transparent and righteous investigation.@ncbn Garu @naralokesh Garu @PawanKalyan Garu @Anitha_TDP Garu @revanth_anumula Garu @Bhatti_Mallu Garu @TelanganaCMO @TelanganaDGP Garu 🙏🏼 https://t.co/M3xbNALZje pic.twitter.com/BBokLPLNEP
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 9, 2024
వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా : తాను ఆ ఇంట్లో ఉన్నట్లు ధ్రువీకరించాలని అధికారులను కోరుతున్నానని మనోజ్ విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ టవర్ లొకేషన్ ధ్రువీకరించాలని అధికారులను అభ్యర్థిస్తున్నానని వ్యాఖ్యానించారు. తన 7 నెలల కుమార్తెను వివాదంలోకి లాగడం అమానవీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యకు ఉద్దేశాలు ఆపాదించడం దురదృష్టకరమని, ఇంట్లో పనివారూ తన నాన్న దుర్భాషలతో భయపడతారని వెల్లడించారు. అన్ని ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు తగిలిన గాయాలకు చికిత్స కోసమే ఆస్పత్రికి వెళ్లానని, విష్ణు సహచరులు విజయ్, కిరణ్ సీసీటీవీ డ్రైవ్‌లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
వారసత్వపు ఆస్తుల కోసం అడగలేదు : ఏం దాచడానికి యత్నిస్తున్నారో సమగ్ర విచారణ జరిపించాలని మంచు మనోజ్ డిమాండ్ చేశారు. తానెప్పుడూ వారసత్వపు ఆస్తుల కోసం అడగలేదని, ఆస్తులు అడిగి ఉంటే సాక్ష్యాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఎంబీయూ విద్యార్థులు దోపిడీకి గురవుతున్నారని, విష్ణు, సహచరులు వినయ్, మహేశ్వర్ ద్వారా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఆర్థిక అక్రమాలు, దోపిడీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అధికారులకు ఆధారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
మంచు కుటుంబంలో రచ్చరచ్చ - మోహన్‌బాబు, మనోజ్‌ల ఫిర్యాదులతో బహిర్గతమైన విభేదాలు