Allu Arjun about Arrest at Jubilee Hills : తాను చట్టాన్ని గౌరవిస్తానని, దానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని తెలిపారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు.
గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు. తన సినిమాలే కాదని తన మామయ్యల సినిమాలూ చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను న్యాయాన్ని నమ్ముతున్నానని ఉద్ఘాటించారు. తాను బాగున్నానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
'నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ని. చట్టానికి కట్టుబడే ఉంటా. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటా. నాకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అభిమానం, ప్రేమతో నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేను న్యాయాన్ని నమ్ముతున్నా' - హీరో అల్లు అర్జున్
భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు : ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సుమారు గంటపాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు. అక్కడి నుంచి అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఇంటికి బయల్దేరిన అల్లు అర్జున్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇంటికెళ్లిన అల్లు అర్జున్ తన సతీమణి, పిల్లలను ఆలింగనం చేసుకున్నారు. కుటుంబసభ్యులు సైతం ఆయనను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అంతకముందే తన ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో అల్లు అర్జున్ వారికి అభివాదం చేశారు.
ప్రక్రియ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అరెస్టయిన అల్లు అర్జున్‌కు తొలుత నాంపల్లి కోర్టు 4 రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ వచ్చినా ప్రక్రియ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. తిరిగి ఇవాళ ఉదయం ఆయన విడుదల అయ్యారు.
'ఇది సరైన నిర్ణయం కాదు' - టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సినీ ప్రముఖుల స్పందన
చంచల్‌గూడ జైలు నుంచి అల్లుఅర్జున్ విడుదల - వెనక గేటు నుంచి ఎస్కార్ట్‌లో ఇంటికి