ACB Raids On Municipal Employee : నిజామాబాద్ నగర పాలక సంస్థ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారైన నరేందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం నాలుగు బృందాలుగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్‌లలోని నరేందర్ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టారు. ఉదయం ఐదు గంటల నుంచి సోదాలు కొనసాగాయి.
అధికారి ఇళ్లలో భారీగా నగదు, బంగారం : నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో భారీగా నగదు, ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రూ.6.07 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వాటిల్లో రూ.2.93 కోట్ల నగదు ఉండగా, రూ.6 లక్షల విలువ చేసే 51 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.98 కోట్ల విలువ చేసే 17 స్థిరాస్తుల దస్త్రాలు, ఆయన భార్య, తల్లి పేరుపై బ్యాంకు ఖాతాల్లో రూ.1.10 కోట్లు ఉన్నాయి.
కాగా అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాన్ గెజిటెడ్ అధికారి హోదాలో ఉండి భారీ మొత్తంలో ఇంట్లో నగదు, విలువైన స్థిరాస్తులు కలిగి ఉండడంతో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేసినట్లుగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వివరించారు.
పలు ఆరోపణలు : నిజామాబాద్ నగరపాలక సంస్థలో నరేందర్ 25 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సూపరింటెండెంట్‌గా ఉండి ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారిగా కూడా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు, ఇళ్ల నంబర్లు కేటాయించడం లాంటి పనులు చేస్తుండేవారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బోధన్ మున్సిపాలిటీకి బదిలీ అవగా పలుకుబడి కలిగిన నేతలు, అధికారులతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి దానిని రద్దు చేయించుకున్నారు.
ఏడాది కాలంగా ఏసీబీ నిఘా : ఆయన గతంలో ఆసరా పింఛన్ల డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నారనే ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. కొంత కాలం క్రితం ప్రభుత్వ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ చేయడంతో ఆ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. ఏసీబీ అధికారులు మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలకు వెళ్లి అక్రమ రిజిస్ట్రేషన్ల విషయాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఏడాది కాలంగా అతనిపై నిఘా ఉంచారు. తాజాగా నరేందర్‌పై అనీశా డీజీ స్థాయిలో ఒకరు ఫిర్యాదు చేశారు.
'మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగారో - ఈ నంబర్‌కు కాల్ చేయండి' - TOLL FREE NO FOR BRIBE COMPLAINTS
రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడి - అదుపులో ఆరుగురు ఏజెంట్లు, ఒక డ్రైవర్