ACB CUSTODY COMPLETE IN SHEEP SCAM : గొర్రెల కుంభకోణం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తాజాగా పశు గణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌కు మూడు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. గొర్రెల యూనిట్ల కాస్ట్ పెంపుదల, నిధుల మళ్లింపు, ముఖ్యమైన దస్త్రాల కాల్చివేత తదితర అంశాలపై ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
అయితే నిందితులు విచారణలో ఏసీబీ అధికారులకు సహకరించలేదని సమాచారం. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో వారిని హాజరుపరిచారు. తిరిగి చంచల్‌గూడ జైలుకు వారిని తరలించారు.
అసలేం జరిగిందంటే... 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4 వేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది. అధికారుల అమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది.
పశు సంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్ధిదారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లి, అక్కడి విక్రయదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు. విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు. బ్రోకర్లను, ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని రూ.2 కోట్లు మళ్లించినట్లు గుర్తించి దర్యాప్తు చేయగా, ఏకంగా రూ.700 కోట్ల కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖను పర్యవేక్షించిన పెద్దల ఆశీస్సులతో ఉన్నతాధికారులను మొహిదుద్దీన్ గుప్పిట పెట్టుకున్నట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తద్వారా శాఖలో తమకు అవసరమైన పోస్టుల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని కుట్రలకు తెర లేపినట్లు నిర్ధారించారు. గొర్రెల కొనడం మొదలు, నగదును సరఫరాదారుల ఖాతాల్లో కాకుండా మొహిదుద్దీన్ బినామీల ఖాతాల్లో పడేలా రికార్డుల్ని తారుమారు చేయడంలో వీరు కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక్కో యూనిట్‌లో మొహిదుద్దీన్ ముఠా సుమారు రూ.33,000ల వరకు కొట్టేసినట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతమైంది.
చాలా యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధుల్ని స్వాహా చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే పలువురికి రూ.కోట్లలో వాటాలు ముట్టాయి. ప్రభుత్వ నిధులను తొలుత మొహిదుద్దీన్ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కావడంతో ఏసీబీ అధికారులు వాటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా, ఆరుగురిని అరెస్టు చేశారు. దుబాయ్ పారిపోయిన మొహిదుద్దీన్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఏంటీ! అంబులెన్సులు, ఆటోలు, బైకుల్లో 'గొర్రెల పంపిణీ' చేశారా? - కాగ్ సంచలన రిపోర్ట్