A statue of Telangana Talli was Unveiled at the Secretariat : రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గుండు పూసలు, ముక్క పుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి, హుందాతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త గంగాధర్‌ను, శిల్పి రమణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
విగ్రహ ఏర్పాటు, రూపురేఖలపై ఉదయం అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన గురించి అసెంబ్లీలో వివరించారు. సంప్రదాయం, సంస్కృతులు పరిగణలోకి తీసుకొని తెలంగాణ తల్లి రూపకల్పన చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని తెలిపారు.
"రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నాం. ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. తమ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని సన్మానిస్తున్నాం. ఎక్కా యాదగిరికి 300 గజాల స్థలం, రూ.కోటి నగదు ఇస్తాం. ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదు. 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ సాధించుకున్నాం." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించాం : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి ఎక్కడైనా మన అస్తిత్వానికి ప్రతీక తల్లి అని చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైందన్న ఆయన ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో అందరం టీజీ అని రాసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మాత్రం టీజీ అక్షరాలు కాదని టీఎస్ అని పెట్టిందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్‌ను టీజీగా మార్చినట్లు వివరించారు. ఉద్యమం రోజుల్లో ఎక్కడ విన్నా జయ జయహే తెలంగాణ వినిపించేదన్న ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయ జయహే తెలంగాణ పాటకు గౌరవం దక్కలేదని, అందుకే వారు జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారని పేర్కొన్నారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి నిరాదరణకు గురైందని అన్నారు.
'తెలంగాణ తల్లి అంటే భావన కాదు - 4 కోట్ల బిడ్డల భావోద్వేగం'
ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి