Python at Wedding Ceremony : ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరుగుతోంది. అంతలోనే ఆ వివాహ వేదిక వద్దకు ఓ అనుకోని అతిథి విచ్చేశారు. ఆ అతిథిని చూసిన అక్కడి వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అదేంటి? అందరూ భయంతో పరుగులు తీస్తున్నారంటే అది ఏదో పులో, సింహమో అనుకుంటే పొరపాటే. అక్కడకు వచ్చిన ఆ అనుకొని అతిథి కొండచిలువ. దాని పొడవు 7 అడుగులు. అంత పెద్ద కొండచిలువను చూసిన వారంతా భయంతో పరుగందుకున్నారు. ఇంతకీ అది ఎక్కడ జరిగిందంటే?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో కాశీ విశ్వేశ్వర స్వామి పంచాయతన శివాలయ మండపం ఉంది. అక్కడి గోదావరి గట్టుపై సుబ్రహ్మణ్యేశ్వర స్నానఘాట్లోని పై అంతస్తులో శివాలయం ఉండగా, కింది భాగంలో కల్యాణ మండపం, వేదిక ఉన్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ఇక్కడి కల్యాణ మండపంలోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అలాగే బుధవారం రాత్రి కూడా ఓ జంట వివాహం జరుగుతుంది. అంతా పెళ్లి బిజీలో ఉత్సాహంగా ఉన్నారు. అంతలో ఒకతనికి గోడ పక్కగా ఏదో మెరుస్తూ, కదులుతున్నట్లు కనిపించింది. ఏంటా అని దగ్గరు వెళ్లి చూశాడు.
తీరా అక్కడ ఉన్నది చూస్తే సుమారు 7 అడుగుల పొడవున్న కొండచిలువ. అది అటూ ఇటూ తిరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పాము.. పాము.. కొండ చిలువ అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. ఆ అరుపులతో పెళ్లి మండపంలోని వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ గుంపులో ఎవరో స్థానిక పట్టణ పోలీసులకు పెళ్లి మండపంలో కొండచిలువ వచ్చిందని సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు.
గంట సేపు కదలకుండా ఉన్న కొండచిలువ : వారందరినీ చూసిన కొండ చిలువ భయంతో ఎటూ కదలకుండా అక్కడే చాలాసేపు ఉండిపోయింది. సుమారు గంట సమయం తర్వాత కొండచిలువ కల్యాణ మండపం గేటు పక్క నుంచి గోదావరి వైపు వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మండపంలో ఓ వైపు చివరికి చేరి వివాహ తంతును పూర్తి చేశారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు, గోదావరి ఒడ్డుకు చేరిన కొండచిలువను పట్టుకొని తీసుకెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ట్రాఫిక్‌ను ఆపేసిన పాము - చూసేందుకు గుమిగూడిన జనం - ఏం జరిగిందో తెలిస్తే!