2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : రైతు బాగుంటేనే ఊరు బాగుంటుందని, వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వమని ఈ క్రమంలోనే వ్యవసాయ రంగానికి, రైతుల అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్(Telangana Agriculture Budget 2024)లో రూ.19,746 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు.
"మా ఎన్నికల ప్రణాళికలోనే స్పష్టంగా చెప్పాం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం. త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీపై కార్యచరణ ఉంటుంది. అందుకు విధివిధానాలు రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం." - భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి
Telangana Budget 2024 : రైతు బంధు పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు పెట్టుబడి సాయం అందించడం అని గత సర్కార్ ఈ స్కీమ్‌ను ప్రారంభించిందని భట్టి విక్రమార్క అన్నారు. అయితే ఈ పథకం(Rythu Bandhu Scheme)తో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారని ఆరోపించారు. సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని మండిపడ్డారు. ఇచ్చిన జీఓకు విరుద్ధంగా పథకాన్ని వర్తింపజేయడం గత ప్రభుత్వానికే సాధ్యమైందని దుయ్యబట్టారు. ఈ అక్రమాల కారణంగా రైతుబంధు నిబంధనలు పునఃసమీక్షించి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.15000 అందిస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?
మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా రాష్ట్రంలోనూ పంటల బీమా (Fasal Bima Scheme in Telangana) పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో అమలు చేస్తున్న తీరును పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
"విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతి సాధించడానికి అవకాశం ఉండీ కూడా సాధించలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది. దానివల్ల రైతులు మోసపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం"- భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
ఆరు గ్యారంటీలకే బడ్జెట్‌లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?
త్వరలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ - గృహజ్యోతి పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే?