Team India Test Records In Uppal Stadium : గురువారం(జనవరి 25న) హైదరాబాద్-ఉప్పల్ మైదానంలో ఇంగ్లాండ్-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్‌కు తెరలేవనుంది. బజ్‌బాల్ క్రికెట్ స్ట్రాటజీతో టెస్టుల్లో విరుచుకుపడుతున్న ఇంగ్లాండ్‌ను టీమ్ఇండియా చిత్తు చేయాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఆరోసారి హైదరాబాద్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడనున్న భారత్‌కు విజయవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగిన ఐదు టెస్టుల్లో మన ఆటగాళ్లు నెలకొల్పిన రికార్డుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పల్ స్టేడియంలో టీమ్ఇండియా రికార్డ్స్
2005లో తొలిసారి ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడింది టీమ్ఇండియా. ఇదే వేదికగా ఇప్పటివరకు 5 టెస్టులాడిన భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి ఓ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.
- భారత్ x న్యూజిలాండ్(2010)- హైదరాబాద్(ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్‌కు ఇది తొలి టెస్టు మ్యాచ్. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక ఈ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ (111 నాటౌట్) అజేయమైన శతకాన్ని సాధించాడు.
- భారత్ x న్యూజిలాండ్(2012)- ఈ మ్యాచ్‌లో భారత్ 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పుజారా (159) విజృంభించాడు. అశ్విన్ 12 వికెట్లు తీశాడు.
- భారత్ x ఆస్ట్రేలియా(2013)- 135 పరుగుల తేడాతో కాంగూరలను మట్టి కరిపించింది టీమ్‌ఇండియా. ఈ మ్యాచ్‌లో పుజారా (204) డబుల్ సెంచరీ చేశాడు.
- భారత్ x బంగ్లాదేశ్(2017)- ఉప్పల్ మైదానంలో జరిగిన ఈ ఏకైక టెస్టు సిరీస్‌లో భారత్ 208 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి (204) డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు.
- భారత్ x వెస్టిండీస్(2018)- ఈ సిరీస్‌లో 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంత్ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు.
జట్టులో లేని వీరికి స్పెషల్ గ్రౌండ్
విరాట్‌కు
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉప్పల్ మైదానంను ఫేవరెట్ గ్రౌండ్‌గా చెప్పవచ్చు. ఇక్కడి పిచ్‌పై అతడు ప్రదర్శించిన ఆటతీరే అందుకు సాక్ష్యం.
ఇవి సాధించాడు
- టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు.
- ఓ డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.
తనకు అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో మాత్రం ఈసారి మ్యాచ్ ఆడటం లేదు విరాట్. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ టెస్టుకు దూరంగా ఉన్నాడని బీసీసీఐ వెల్లడించింది.
పుజారాకు
ప్రస్తుతం జట్టులో లేని వెటరన్ టెస్టు బ్యాటర్ పుజారాకు కూడా ఈ మైదనంలో గొప్ప రికార్డు ఉంది.
- 5 ఇన్నింగ్స్‌ల్లో అతడు 127.50 సగటుతో 510 పరుగులు సాధించాడు.
- ఓ డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
బౌలింగ్‌లోనూ వీరిదే హవా
బౌలింగ్ విషయానికి వస్తే ఉప్పల్ మైదానంలో జట్టు స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే కావడం విశేషం.
- సీనియర్ స్పిన్నర్ అశ్విన్- 8 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లు
- జడేజా- 15 వికెట్లు
- ఉమేశ్ యాదవ్- 15 వికెట్లు
- ప్రజ్ఞాన్ ఓజా- 9 వికెట్లు
- హర్భజన్ సింగ్- 7 వికెట్లు.
ఇలా అన్ని విధాలుగా టీమ్ఇండియాకు ఉప్పల్ మైదానం కలిసొచ్చిందనే చెప్పాలి. గురువారం(జనవరి 25)న ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ జట్టు గెలవాలని క్రికెట్ ప్రియులు ఆశిస్తున్నారు.
రవిశాస్త్రికి బీసీసీఐ ప్రతిష్టాత్మక అవార్డు - గిల్‌కు కూడా
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్