T20 World Cup 2024 Rahul Dravid : టీమ్‌ఇండియా ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో టీ20 ప్రపంచ కప్పును సాధించింది. ఈ గెలుపుతో భారత్ జట్టుతో పాటు యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఈ సమయంలోనే ఎప్పడూ తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరిచే అలవాటే లేని కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా గట్టిగా అరుస్తూ ఉద్వేగానికి గురయ్యారు. కెప్టెన్‌గా సాధించలేని కప్పును కోచ్‌గా సాధించి ఓ జీవితకాల వెలితిని పూడ్చుకున్నారు అదే కరీబియన్ గడ్డపై. దాదాపు 17 ఏళ్ల తర్వాత పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్టు సారథిగా విఫలమైనా హెడ్‌కోచ్‌గా ట్రోఫీ అందుకున్నారు. ఒకరకంగా ద్రవిడ్‌కిది చక్ దే ఇండియా మూమెంట్ అనే చెప్పాలి. గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనే ద్రవిడ్‌కు ఈ మూమెంట్ రావాల్సింది. కానీ ఆటగాళ్లు, అభిమానుల మనసులు గెలిచిన ఈ ఫ్రెండ్లీ కోచ్ ఎనిమిది నెలలు ఆలస్యంగానైనా తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ఉప్పొంగిన ఉద్వేగం
ఇక రాహుల్ ద్రవిడ్ భావోద్వేగాలను పెద్దగా బయటకు కనిపించేలా ఉండరు. కానీ ఆటగాడిగా దక్కని ప్రపంచకప్ ఇప్పుడు కోచ్‌గా సొంతమవడం వల్ల ద్రవిడ్ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయారు. ఫైనల్లో విజయం తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో పాటు సంబరాల్లో తేలిపోయారు. ఇక కప్ చేతుల్లోకి వచ్చిన వెంటనే గట్టిగా అరుస్తూ ఉద్వేగాన్ని బయటపెట్టారు.
You would have never seen this avatar of Rahul Dravid.#T20WorldCupFinal #HardikPandya#RahulDavidpic.twitter.com/UapK7lyh36
— Manoj Tiwari (@ManojTiwariIND) June 30, 2024
జూనియర్ కోచ్‌గా తనదైన ముద్ర
జెంటిల్మన్ క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఉన్న పేరు గురించి అందరికి తెలిసిందే. దాదాపు దశాబ్దన్నరపాటు ఆటగాడిగా టీమ్‌ఇండియాకు సేవలందించారు. రిటైరయ్యాక కూడా ఎంతో కాలం ఆటకు దూరంగా లేడు. జూనియర్ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేశారు. భారత్ అండర్-19, భారత్-ఎ ఆటగాళ్ల నైపుణ్యాలను సానపట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మార్గనిర్దేశకంలో భారత కుర్రాళ్లు అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) అధిపతిగానూ ద్రవిడ్ పనిచేశారు. అయితే జూనియర్ జట్లకు కోచ్‌గా ఇంత పేరు తెచ్చుకున్నా, ఎప్పుడూ టీమ్‌ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని కనబరచలేదు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ(అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు) రవిశాస్త్రి అనంతరం కోచ్‌గా ఉండేలా ద్రవిడ్‌ను ఒప్పించగలిగారు. కానీ కోచింగ్ ద్రవిడ్‌కు పూల పాన్పేమీ కాలేదు. అయినా సవాళ్లను అధిగమించారు. గతేడాది వన్డే ప్రపంచకప్ కలిగించిన నిరాశను జయించి టీమ్‌ఇండియాకు టీ20 కప్పు అందించేదాకా ఆయన విశ్రమించలేదు.
జట్టు ఓటమితో విమర్శలు
2021 నవంబరులో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ద్రవిడ్, ఆరంభంలోనే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కోహ్లి కెప్టెన్సీపై రగడ, టీమ్‌లో రేగిన అలజడి సయమంలో అశాంతిని చల్లార్చి, ఆటపై పూర్తిగా ఏకాగ్రత నిలిపేలా చేశారు ద్రవిడ్. అదే ఆయన సాధించిన మొదటి విజయం. కానీ, కోచ్‌గా మొదట్లో ద్రవిడ్‌కు అంతగా మంచి పేరు ఏమీ రాలేదు. అందుకు మేజర్ టోర్నీల్లో టీమ్‌ఇండియా ప్రదర్శనే కారణం. 2022 ఆసియాకప్, టీ20 ప్రపంచకప్పుల్లో భారత్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ భారత్ ఓడిపోడవడం వల్ల ద్రవిడ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, మౌనంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు జట్టును ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం చేశారు. మిస్టర్ డిపెండబుల్.
అతి పెద్ద విజయం
2023 ప్రపంచకప్‌నకు తగిన కూర్పు కోసం సంవత్సరం ముందు నుంచే ప్రక్రియను మొదలుపెట్టారు ద్రవిడ్. ప్రపంచకప్‌లో ఆడగలరు, వారి అవసరం ఉందనుకున్న ఆటగాళ్లను గుర్తించి వారిపైనే దృష్టిసారించడమే ఆయన చేసిన మొదటి పని. అలాగే ఆ ఆటగాళ్లకు తగినన్ని మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించారు. సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్‌తో కలిసి గొప్ప సమన్వయంతో వ్యవహరించిన ద్రవిడ్, 24 మంది ఆటగాళ్లతో ఓ పూల్‌ను సిద్ధం చేశారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచకప్‌కు కొన్ని నెలల ముందు భారత జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లంతా ఈ పూల్‌లోని వాళ్లే ఉంటారు. మరొకరు కనిపించరు. ఇందులో నుంచే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేశారు. ద్రవిడ్ ముందు చూపు, పక్కా ప్రణాళికకు ఇది ఓ సూచిక కనిపిస్తుంది. వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాల్లో ద్రవిడ్ ముద్ర స్పష్టం. జట్టును టీ20 ప్రపంచకప్‌కు గొప్పగా సమాయత్తం ద్రవిడ్ చేశారు. అయితే వన్డే ప్రపంచకప్‌తోనే తన పదవీకాలం ముగిసినా, ప్రస్తుత టోర్నీ వరకు కొనసాగడానికి అంగీకరించి, జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా చేశారు ద్రవిడ్. అన్నింటికన్నా మిన్నగా తన స్నేహశీలతతో ఆటగాళ్లందరి విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందడం ద్రవిడ్ సాధించిన అతి పెద్ద విజయం.
టీమ్ఇండియాకు మోదీ ఫోన్- రోహిత్, విరాట్‌తో స్పెషల్ చిట్‌చాట్!