Sumit Nagal Fees Demand : భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి క్రీడాభిమానులకు తెలిసే ఉంటుంది. అయితే తాజాగా అతడి గురించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఇకపై దేశానికి తాను ప్రాతినిధ్యం వహించాలంటే ఎక్కువ ఫీజును తనకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలను నగాల్ కూడా ఏమీ కొట్టి పారేయలేదు. స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే ఎక్కువ డబ్బును డిమాండ్ చేసినట్లు అతడు చెప్పాడట.
నగాల్‌పై ఐటా విమర్శలు - నగాల్ ఈ ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1టైలకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోనూ ఆడేందుకు నిరాకరించాడు. రీసెంట్గా స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం అని దూరమయ్యాడు. కానీ చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు మాత్రం వెళ్లాడు. దీంతో ఐటా అతడిపై బహిరంగంగానే విమర్శలు చేసింది.
దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నగాల్ సాకులు చెబుతున్నాడని పేర్కొంది. కానీ ఏటీపీ టోర్నీ ఆడేందుకు మాత్రం సిద్ధంగా ఉంటున్నాడని వెల్లడించింది. కాగా, శశికుమార్ ముకుంద్, యూకీ బాంబ్రీ కూడా డేవిస్ కప్‌కు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో జరిగిన పోటీలో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ లేకపోవడంతో భారత్ 0- 4తో చిత్తుగా ఓడాల్సి వచ్చింది.
ఎన్ని లక్షలు డిమాండ్ చేశాడంటే? - ఐటా అధ్యక్షుడు అనిల్ ధూపర్ నగాల్‌పై విమర్శలు గుప్పించారు. "ఎవరైనా దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా? సుమిత్ నగాల్ వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (దాదాపు రూ.45 లక్షలు) ఇవ్వాలని అడుగుతున్నాడు. కానీ అతడికి చెల్లించలేదు కాబట్టే అతడు సాకులు చెప్పి ఆడటం లేదు. అయినా అసలు ఇదేం పద్ధతి. ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా సెలెక్ట్ చేసిన ప్లేయర్స్‌కు టాప్స్ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు కూడా నిర్ణీత మొత్తంలో వారికి అందజేస్తున్నారు. ప్రపంచకప్ గ్రూప్ 1లో ఆడితే ఐఏటీఏకు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే ఇస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ఐటా దగ్గర ఉంటున్నాయి" అని అనిల్ ధూపర్ వివరించారు.
సుమిత్ ఏమన్నాడంటే? - ఐటా చేసిన విమర్శలను సుమిత్ నగాల్ ఖండించలేదు. కానీ తన వాదనను సోషల్ మీడియా వేదికలో తెలిపాడు. "ఫీజు అడిగిన మాట నిజమే. దీనిపై మీకు మరింత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్లేయర్స్ సన్నద్ధమయ్యేందుకు చాలా ఖర్చులు ఉంటాయి. నేను డిమాండ్ మొత్తం ఆట కోసం సరిపోతుంది.
స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే డిమాండ్ చేశాను. అంతే తప్ప మరో ఉద్దేశ్యం లేదు. దేశానికి ఆడటం అనేది ఏ ప్లేయర్ అయినా గర్వంగా భావిస్తాడు. అది గొప్ప గౌరవం. వెన్నునొప్పి కారణంగానే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేదు. ఇప్పుడు కూడా ఇదే సమస్య. అందుకే చైనా ఓపెన్ నుంచి కూడా తప్పుకున్నాను." అని నగాల్ వివరణ ఇచ్చాడు.
భారత్ - బంగ్లా ప్లేయర్స్ కోసం స్పెషల్ డైట్ మెనూ - ఏమేం ఉన్నాయంటే? - IND VS BAN Players Diet Chart