Anshuman Gaekwad Blood Cancer : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (71) దాదాపు ఏడాది నుంచి బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అన్షుమాన్ గైక్వాడ్ దీనస్థితిలో ఉన్నాడని, అతనికి ఆర్థికసాయం చేయాలని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకి బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ అంశాన్ని పేర్కొంటూ, అన్షుమాన్ గైక్వాడ్ చికిత్సకు ఆర్థిక సాయం చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
సందీప్ పాటిల్ మాట్లాడుతూ, "బీసీసీఐ నుంచి తనకు ఆర్థిక సహాయం అందిందని, ఇంకా డబ్బు అవసరమని గైక్వాడ్ నాతో చెప్పాడు. ఈ విషయంపై బీసీసీఐ ట్రెజరర్‌తో మాట్లాడాం. మా అభ్యర్థనతోపాటు, ఇతర మాజీ క్రికెటర్లు చేసిన రిక్వెస్ట్‌లను పరిశీలిస్తానని ఆశిష్ షెలార్ చెప్పాడు. అతను బోర్డు నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుని అన్షు ప్రాణాలు కాపాడతారని భావిస్తున్నా. ఏ దేశానికి చెందిన క్రికెటర్లకైనా ఆయా దేశాల బోర్డులు సహాయం అందించాలి. అన్షుమాన్ విషయానికి బీసీసీఐ మరింత ప్రాధాన్యం ఇవ్వాలి." అని అన్నాడు.
- అన్షుమాన్ గైక్వాడ్ క్రికెట్ జర్నీ
1952లో ముంబయిలో జన్మించాడు అన్షుమాన్ గైక్వాడ్. 1974లో భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. మొత్తం 40 టెస్ట్‌లు ఆడాడు. ఒక ప్రపంచ కప్‌లో పాల్గొన్నాడు. 32.08 యావరేజ్‌తో 1,959 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోరు 201. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 15 మ్యాచుల్లో 20.69 యారేజ్‌తో 269 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 78. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 206 మ్యాచ్‌లు ఆడి 326 ఇన్నింగ్స్‌లలో 41.26 యావరేజ్‌తో 12136 రన్స్ సాధించాడు. అత్యధిక స్కోరు 225 కాగా, ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో 55 మ్యాచ్‌లు ఆడి 53 ఇన్నింగ్స్‌లలో 32.67 యావరేజ్‌తో 1601 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి.
అయితే 1982లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు అన్షుమాన్. అనంతరం గైక్వాడ్ కోచింగ్‌గా మారాడు. 2000 నుంచి 2001 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. గైక్వాడ్ చివరి వరకు తనకు నచ్చిన క్రికెట్‌కు సేవలు అందించాడు.
టీ20కు రిటైర్మెంట్ - మరి కోహ్లీ, రోహిత్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? - Kohli Rohith T20 Retirement