Rules Used In IPL Not In T20s: టెస్టులు, వన్డేలకు ఆదరణ తగ్గుతున్న సమయంలో క్రికెట్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు టీ20 ఫార్మాట్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో లాంఛ్ అయిన ఐపీఎల్ ఏ రేంజ్ సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. విజయవంతంగా 17వ సీజన్ జరుపుకుంటున్న ఐపీఎల్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొత్త కొత్త రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తోంది. బ్యాటర్‌లకు, బౌలర్‌లకు సమాన అవకాశాలు ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ రూల్స్ ఐసీసీ టీ20లకు వర్తించవు. ఐపీఎల్ అయిపోగానే టీ20 వరల్డ్‌కప్ మొదలు కానుండటంతో రూల్స్ మధ్య కన్ఫూజన్ లేకుండా ఉండేందుకే ఈ స్టోరీ.
ఇంపాక్ట్ ప్లేయర్: IPL 2023లోనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో కూడా ఈ రూల్ కంటిన్యూ అవుతోంది. ఈ నియమం ప్రకారం, టీమ్‌లు 12వ ఆటగాడిని ప్లేయింగ్ 11లో ఉన్న ఇతర ఆటగాడితో రీప్లేస్ చేయవచ్చు. మ్యాచ్‌లో ఏ క్షణంలోనైనా ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
రెండు బౌన్సర్‌లకు ఛాన్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నుంచి ఒక ఓవర్‌లో బౌలర్ రెండు బౌన్సర్‌లు వేయవచ్చు. ఇంతకు ముందు ఒక బౌన్సర్‌కి మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఈ రూల్ ఐపీఎల్‌కి మాత్రమే వర్తిస్తుంది, ఇంటర్నేషనల్ T20Iలలో ఒక బౌలర్ ఒక ఓవర్‌లో ఒక బౌన్సర్ మాత్రమే వేయాలి.
నో బాల్, వైడ్ బాల్ ఛాలెంజ్: ఐపీఎల్‌లో ఇకపై అంపైర్‌లు ఇచ్చిన నోబాల్, వైడ్ బాల్ కాల్స్‌ని బ్యాటింగ్ జట్లు ఛాలెండ్ చేయవచ్చు. DRS(డెసిషన్ రివ్యూ సిస్టమ్) కోరవచ్చు. ఇంటర్నేషనల్ టీ20లలో ఈ రూల్ ఇంకా ప్రవేశపెట్టలేదు.
స్ట్రాటెజిక్ టైమౌట్: ఐపీఎల్ మ్యాచ్ 20 ఓవర్లలో 2 నిమిషాల 30 సెకన్లపాటు రెండు బ్రేక్‌లు తీసుకోవచ్చు. మొదటి బ్రేక్ ఫీల్డింగ్ సైడ్ కోసం 6 నుంచి 9 ఓవర్ల మధ్య ఉంటుంది. రెండో బ్రేక్ 13 నుంచి 16 ఓవర్ల మధ్య బ్యాటింగ్ చేసే జట్టు కోసం తీసుకుంటారు.
స్మార్ట్ రీప్లే సిస్టమ్: ఈ ఐపీఎల్ సీజన్‌లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీంతో బ్రాడ్‌కాస్టర్ అవసరం లేకుండా పోయింది. ఈ సిస్టమ్ ద్వారా అంపైర్ వేగంగా, కచ్చితంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. థర్డ్ అంపైర్ క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు, పరిస్థితిని అంచనా వేసేందుకు అవసరమైన ఫ్రేమ్‌లను పొందడానికి హాక్-ఐ ఆపరేటర్‌లతో నేరుగా టచ్‌లో ఉంటారు. ఈ ఐదు నిబంధనలు కేవలం ఐపీఎల్‌కే పరిమితం. ఈ రూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వర్తించవు.
ఇంటర్నేషనల్ టీ20కే పరిమితం: T20 ప్రపంచ కప్ 2024 నుంచి స్టాప్ క్లాక్ నియమాన్ని అమలు చేయాలని ICC నిర్ణయించింది. ఇందులో మునుపటి ఓవర్ ముగిసిన తర్వాత జట్లు 60 సెకన్లలోపు కొత్త ఓవర్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది. ఒక వేళ నిమిషంలోపు నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయకపోతే అంపైర్ రెండు సార్లు హెచ్చరిస్తారు. మళ్లీ ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఐదు పరుగులు జరిమానా విధించవచ్చు. ఐపీఎల్‌లో ఈ నిబంధన అమల్లో లేదు.