Raina Bhojpuri Commentary : చాలా కాలం కలిసి క్రికెట్ ఆడిన క్రికెటర్లు, ఐపీఎల్ సహచరులు సహజంగానే స్నేహితులు అవుతారు. అయితే ఎంఎస్ ధోని, సురేష్ రైనా మధ్య ఫ్రెండ్‌షిప్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, అలాగే టీమ్ ఇండియాలో చాలా ఏళ్లు క్రికెట్ ఆడారు. ముఖ్యంగా చెన్నై జట్టు ఐపీఎల్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. మైదానంలో ఎంత అన్యోన్యయంగా ఉంటారో, మ్యాచ్ తర్వాత కూడా ఈ ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని, రైనా స్నేహబంధం మరోసారి స్పష్టమైంది.
క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికిన రైనా, ప్రస్తుతం ఐపీఎల్‌కు కామెంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలే తాను భోజ్‌పురిలోనూ కామెంట్రీ చేశారు. ఇది విని ధోని ఆనందం వ్యక్తం చేసినట్లు చెప్పాడు. ధోనికి ఇటీల మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో ధోని మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ధోని ఎడమకాలికి గట్టిగా పట్టీలాంటిది చుట్టుకుని కనిపించాడు. దీన్ని బట్టి ధోనిని మోకాలి నొప్పి ఇబ్బంది పెట్టినట్లు స్పష్టమవుతోంది. మ్యాచ్ ముగియగానే, ధోని మెట్లు దిగడానికి ఇబ్బంది పడుతుంటే, రైనా సాయం చేశాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రైనా మీడియాతో పంచుకున్నాడు.
'బహుత్ హి గజబే కామెంటరీ కర్ రహే భోజ్‌పురియా మే(భోజ్‌పురిలో కామెంట్రీ అద్భుతంగా ఉంది)' అనగా, తాను హర్యాన్వి(హరియాణాలో మాట్లాడే భాష) కూడా బాగుంది అని చెప్పాను అన్నాడు. ఐపీఎల్‌లో వీరేంద్ర సెహ్వాగ్ హర్యాన్వీ కామెంట్రీ లీడ్ చేస్తున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులే చేసింది. రోహిత్ శర్మ (105*)వీరోచిత పోరాటం వృథా అయింది. పతిరన (4/28) ముంబయిని దెబ్బకొట్టాడు.
మొదట ఈ భారీ లక్ష్య ఛేదనను ముంబయి ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ (23 పరుగులు, 15 బంతుల్లో) బౌండరీలతో చెన్నై బౌలర్లపై దాడికి దిగారు. వీరి ధాటికి ముంబయి 5 ఓవర్లకే 50 స్కోర్ దాటింది. ఇక జోరు మీదున్న ముంబయికి యంగ్ పేసర్ మతీషా పతిరణ కళ్లెం వేశాడు. ఓకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు.