PV Sindhu Marriage : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయితో ఈ నెల 22న ఆమె వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరుగుతుంది.
"మా రెండు ఫ్యామిలీలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కానీ నెల కిందటే మేము ఈ పెళ్లి ఖాయం చేసుకున్నాం. జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుంది. ఆమె షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల డిసెంబరు 22న ఈ వివాహ వేడుకకు ముహూర్తాన్ని నిర్ణయించాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. వచ్చే సీజన్ తనకు ఎంతో ఇంపార్టెంట్" అని సింధు తండ్రి పీవీ రమణ తాజాగా మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి.
ఇక పీవీ సింధు కెరీర్ విషయానికి వస్తే, గత రెండేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తున్న ఈమె, సోమవారం జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషన్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి వు లుయో యును చిత్తు చేసి వరుస గేమ్‌ల్లో గెలిచింది. కాగా, కెరీర్లో సయ్యద్ మోదీ టైటిల్ నెగ్గడం సింధుకు ఇది మూడోసారి. ఇదివరకు ఆమె 2017, 2022 టైటిల్ గెలుపొందింది. చివరిసారిగా 2022 జులైలో సింగపూర్ ఓపెన్ విజేతగా సింధు చరిత్రకెక్కింది.ఆ తర్వాత 2023లో స్పెయిన్ మాస్టర్స్ 300, 2024లో మలేసియా మాస్టర్స్ 500 టోర్నీల్లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ పోరులో సింధు ఓటమిని చవి చూసింది.
2016 రియో ఒలింపిక్స్‌లో తొలిసారి రజత పతకం సాధించిన సింధు, ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచింది. ఇలా వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు తన పేరిట ఓ అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 2017లో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి నెంబర్ 2 స్థాయికి చేరింది.