Piyush Chawla UPL 2024: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా ప్రస్తుతం యూపీ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నమెంట్లో అతడు నోయిడా సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ లీగ్‌లో గోరఖ్‌పుర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో పీయూశ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగో ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్‌లో నోయిడా 91 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఈ పేలవ ప్రదర్శన తర్వాత పీయూశ్ తన 7ఏళ్ల కుమారుడి మాటలతో మోటివేట్ అయినట్లు చెప్పాడు. తర్వాత రెండో మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నట్లు చావ్లా రీసెంట్గా ఓ స్పోర్ట్స్ ఛానెల్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
'యూపీ లీగ్ మ్యాచ్‌లో నేను 54 పరుగులు ఇచ్చాను. అంత ధారాళంగా పరుగులివ్వడం అదే నా కెరీర్లో అదే తొలిసారి. దీని గురించి నా కొడుకు (అద్విక్)తో ఫోన్లో చర్చించాను. ఆద్విక్ ఈ మ్యాచ్‌లో చాలా పరుగులిచ్చా అని అన్నాను. 'డోంట్ వర్రీ, నువ్వు బాగా బౌలింగ్ చేశావు' అని చెప్పాడు. ఆ తర్వాత లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు నాకు ఫోన్ చేసి 'నిజమైన బాస్ ఎవరో అందరికీ చూపించు' అని అన్నాడు. 7ఏళ్ల పిల్లాడు అలా చెప్పడం నిజమైన మోటివేషన్. వినడానికి ఇది ఫన్నీగా ఉండవచ్చు. కానీ, నన్ను ఆ మాటలు బాగా ఉత్తేజపరిచాయి. ఆ మ్యాచ్‌లో నేను అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యా. ఆ మ్యాచ్ తర్వాక ఫోన్ చేసి 'నువ్వు రియల్ బాస్ అని చెప్పాను కదా!' అని అన్నాడు' అని చావ్లా పేర్కొన్నాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో చావ్లాకు రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. 'ఐపీఎల్ నుంచి ముందు మీరు రిటైర్ అవుతారా? ధోనీ అవుతారా?' అని చావ్లాను యాంకర్ అడిగారు. దానికి చావ్లా 'మహీ భాయ్' అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. అయితే 'అందరూ అకాయ్ కోహ్లీ వచ్చేదాకా ధోనీ ఆడతాడు అంటున్నారు' అని యాంకర్ సరదాగా అన్నారు.
ఈ నేపథ్యంలో యంగ్ క్రికెటర్ పృథ్వీ షాతో జరిగిన ఓ సంభాషణను చావ్లా షేర్ చేసుకున్నాడు. 'PC భయ్యా, చాలా ఇక మీరు ఆగిపోండి' అని షా నాతో అన్నాడు. దీనికి నేను 'సచిన్‌తో ఆడాను, ఇప్పుడు ఆయన కుమారుడితో ఆడుతున్నా. ఇక నీతో ఆడాను, నీ కొడుకుతో ఆడిన తర్వాత రిటైర్ అవుతా' అని పృథ్వీ షాకు చెప్పినట్లు చావ్లా వివరించాడు. కాగా 2006 చావ్లా అరంగేట్రం చేశాడు.
రఫ్ఫాడిస్తున్న సీనియర్స్.. రికార్డ్స్‌తో యంగ్ ప్లేయర్స్‌కు సవాల్