PARIS PARALYMPICS 2024 SWIMMER ALI TRUWIT : లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు అంగవైకల్యం అడ్డు కాదని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. రంగం ఏదైనా సరే తమ ప్రతిభను చూపి ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. అలా తాజాగా క్రీడా రంగంలో ఓ అమ్మాయి తనకు నచ్చిన స్విమ్మింగ్ కోసం, ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి, ఏకంగా షార్క్ దాడి నుంచి కోలుకుని మరి లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఈ ప్రమాదంలో ఆమె తన కాలును కోల్పోయింది. అయినా ఆమె ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగబోతుంది.
ఆమెనే 24 ఏళ్ల అలీ ట్రువిట్. స్విమ్మింగ్ ఈ అమ్మాయికి ఎంతో ఇష్టమైన, నచ్చిన క్రీడ. అయితే ఒకరోజు ఈమె సముద్రంలో ఈత సాధన చేస్తుండగా షార్క్ బలంగా దాడి చేసింది. షార్క్ ఆమె పాదాన్ని నోట చిక్కించుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసింది. కానీ ట్రువిట్ ఎంతో ధైర్యంగా పోరాడింది. అంత పెద్ద దాడిలో కూడా 70 అడుగుల పైనే ఈదుకుంటూ వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది. సమీపంలో ఉన్న బోటు దగ్గరకు ఈదుకుంటూ పోయి ప్రాణాలు రక్షించుకుంది.
అయితే ఈ దాడి వల్ల ఆమెకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. ఆ తర్వాతే ఆమె కోలుకుంది. కానీ ఆమె కాలును మాత్రం పోగొట్టుకుంది. కానీ స్విమ్మింగ్‌పై ఇష్టాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో మళ్లీ నీళ్లలో దిగింది. స్విమ్మింగ్‌పై పూర్తి దృష్టి సారించింది. ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. ట్రువిట్ ఇప్పుడు ఎస్-10 విభాగంలో పోటీ పడనుంది. 100 మీటర్ల ఫ్రీ స్టయిల్, 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పోటీలోకి దిగనుంది.
షార్క్ దాడి గురించి ట్రువిట్ మాట్లాడుతూ - "షార్క్ దాడి చేసిన తర్వాత మళ్లీ నీళ్లలోకి దిగాలంటే చాలా భయమేసింది. బాగా వణికిపోయాను. అందుకే ఇప్పటికీ బహిరంగంగా ఉండే నీళ్లలోకి అస్సలు వెళ్లను. ఆ దాడి నా మనసులో ఎంతో భయాన్ని కలిగించింది. అయినా నాకు నీళ్లపై ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే పారా స్విమ్మింగ్‌లోకి వచ్చి నా ఇష్టాన్ని కొనసాగిస్తున్నాను. " అని ట్రువిట్ చెప్పుకొచ్చింది.
కాగా, అమెరికాకు చెందిన ట్రువిట్ తల్లి జాడీ కూడా స్విమ్మరే కావడం విశేషం. ఆమె యేల్ యూనివర్సిటీ డైవింగ్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించారు. అందుకే అమ్మ లాగే తాను కూడా స్విమ్మర్ అవ్వాలని ట్రువిట్ ఆశపడింది. దానిపై ఇష్టాన్ని పెంచుకుంది.
పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage
పారిస్ పారాలింపిక్స్ - వీరిపైనే పసిడి ఆశలు - Paris Paralympics 2024