T20 World cup 2024 Pitch Rating ICC : టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసి దాదాపుగా నెలన్నర అయిపోయింది. అయితే ఈ ప్రపంచ కప్ కోసం న్యూయార్క్‌లో వినియోగించిన పిచ్‌లపై విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. బౌలర్లకు వరంగా మారిన ఈ పిచ్‌లపై బ్యాటర్లు పరుగులు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
అయితే చాలా రోజుల తర్వాత తాజాగా ఐసీసీ ఈ పిచ్‌లపై రేటింగ్ ఇచ్చింది. సాధారణంగా ఒక టోర్నీ లేదా సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ రేటింగ్లను ప్రకటిస్తుంది. కానీ ఈ సారి మాత్రం టీ20 వరల్డ్ కప్ ముగిసిన చాలా రోజులకు ఐసీసీ స్పందించింది. సంతృప్తికరం రేటింగ్‌ను ఇచ్చింది.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో న్యూయార్క్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా ఈ మ్యాచ్‌లన్నింటిలోనూ స్వల్ప స్కోర్లే నమోదవ్వడం విమర్శలకు దారీ తీసింది. అయితే ఇప్పుడు ఈ ఎనిమిది మ్యాచుల్లో ఆరు మ్యాచ్‌లకు విపయోగించిన పిచ్‌లు సంతృప్తికరంగా ఉన్నాయని ఐసీసీ వెల్లడించింది. వీటిలో టీమ్ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్(IND VS PAK World Cup 2024) కూడా ఉంది. ఈ పోరులో టీమ్ ఇండియా 119 పరుగులకు ఆలౌట్ అవ్వగా పాక్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 113/7కే చేతులెత్తేసింది.
T20 World cup 2024 Pitch Unsatisfy : ఇకపోతే టీమ్ ఇండియా - ఐర్లాండ్ మ్యాచ్‌తో పాటు శ్రీలంక-దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్ బాలేదని, అసంతృప్తిగా ఉందని పేర్కొంది. అయితే అమెరికాలో ప్రస్తుతం క్రికెట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఈ రేటింగ్‌లు ఇచ్చిందని, అందుకే కఠినంగా వ్యవహరించలేదని వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, మొత్తంగా ఈ టీ20 వరల్డ్ కప్లోన 52 మ్యాచులు జరిగాయి. ఇందులో కేవలం 3 పిచ్‌లు మాత్రమే బాలేదు అనే రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. ఇక ఫైనల్‌కు(World cup 2024 Final Match) ఆతిథ్యం ఇచ్చిన బ్రిడ్జ్‌టౌన్ ట్రాక్ చాలా బాగుంది అని రేటింగ్ ప్రకటించింది.