IND vs ENG 3rd Test : రాజ్‌కోట్ వేదికగా గురువారం జరగనున్న మూడో టెస్టులో తమ ఆధిపత్యం చలాయించేందుకు సిద్ధంగా ఉంది. రెండో టెస్టులో తమ ఆటతీరుతో చెలరేగిపోయిన రోహిత్ సేన రానున్న మ్యాచ్‌లోనూ గెలువును తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మిగతా మూడు టెస్టులకు టీమ్ఇండియా ప్లేయర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రానున్న మ్యాచ్ కోసం తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.
ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లోనూ ఓటమి చూడని భారత్ రానున్న మ్యాచ్‌లో ఎటువంటి ప్లేయర్లను ఆడనివ్వనుందో అంటూ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే బ్యాటింగ్‌లో విఫలమవుతున్న వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను తప్పించి యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొదటి టెస్టులో కాస్త ఫర్వాలేదనిపించిన భరత్, వైజాగ్‌లో జరిగిన మ్యాచ్‌లో డీలా పడ్డాడు. ఇలా జరిగిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను నిరుత్సాహానికి గురి చేసింది. దీంతో ఇప్పటి మ్యాచ్‌కు భరత్‌ను పక్కన పెట్టేందుకు మేనేజ్మెంట్ ఆలోచిస్తోందట.
మరోవైపు రెండో టెస్టులో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ ఈ సారి మ్యాచ్‌లోనూ ఆడనున్నాడు. రజత్ పటిదార్‌కు మరో అవకాశాన్ని ఇచ్చేందుకు మక్కువ చూపిస్తున్నరట. అయితే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా తమ ఫిట్నెస్ను నిరూపించుకోకపోతే మాత్రం వారిద్దరి స్థానంలో సర్ఫరాజ్, కుల్‌దీప్ తుది జట్టులోకి వస్తారు.
ఇదిలా ఉండగా, మూడో టెస్టు ఫలితాల బట్టి నాలుగో మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తోందట. ఈ మూడో టెస్టులో టీమ్ఇండియా విజయం సాధిస్తే అప్పుడు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడి నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకి రాంచీ వేదికగా జరిగే నాలుగో టెస్టుకు విశ్రాంతినిస్తారనే వార్తలు వస్తున్నాయి.
మరోవైపు యంగ్ ప్లేయర్ ఆకాశ్ దీప్‌ను ఇటీవలే ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో అతడికి అవకాశం రావడం కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు. సిరాజ్, ముకేశ్ కుమార్ పేసర్లుగా మైదానంలోకి దిగుతారు. భారత పిచ్‌లపై ఇద్దరి కంటే ఫాస్ట్ బౌలర్లను ఆడించే సందర్భాలు కూడా చాలా తక్కువగానే నమోదయ్యాయి. ధర్మశాల వేదికగా జరిగే చివరి మ్యాచ్ నాటికి బుమ్రా తిరిగి జట్టులోకి వస్తాడు. ఇక భారత క్రికెట్‌కు సేవలు అందించినందుకు సొంత మైదానం రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టు సందర్భంగా జడేజా, పుజారాకు బీసీసీఐ సన్మానం చేయనుంది.
IND vs ENG 3rd Test Playing XI : భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్ (ఫిట్‌నెస్ సాధిస్తే), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా (ఫిట్‌నెస్ సాధిస్తే), అక్షర్ పటేల్, బుమ్రా, సిరాజ్/ముకేశ్
ఇంగ్లాండ్‌తో సిరీస్ - గుబులు పుట్టిస్తున్న కోహ్లీ డెసిషన్!
సిరీస్ మధ్యలోనే భారత్‌ను వీడనున్న ఇంగ్లాండ్ జట్టు - అసలేం జరిగిందంటే?