Teamindia Batters struggled against Spin Bowling : గత కొన్నేళ్లుగా ప్రపంచ క్రికెట్లో టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్లలోనూ ఆధిపత్యం చెలాయిస్తోందన్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు సార్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరడం, గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ను కూడా దక్కించుకుంది. అయితే ఇంత దృఢంగా ఉన్నప్పటికీ టీమ్ ఇండియాకు ఒక సమస్య మాత్రం తీరట్లేదు. అదే స్పిన్. స్పీన్ను ఆడటంలో మన బ్యాటర్ల ఒడిదొడుకులకు గురౌతూనే ఉన్నారు.
ఈ లక్షణాలు కరువయ్యాయి?(Reasons behind struggle against spin) - బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే ఎంతో ఓపిక, ప్రత్యేకమైన నైపుణ్యం చాలా అవసరం. ముఖ్యంగా బంతిని వేగంగా అంచనా వేయగలిగే ప్రతిభ ఉండటం ఎంతో అవసరం. గాల్లో నుంచి వచ్చే బంతులైనా, గింగిరాలు తిరిగేవి అయినా, నేరుగా వచ్చినా, మొత్తంగా బంతి ఎలా వచ్చినా వాటిని సమర్థంగా ఎదుర్కోగలగాలి. పగుళ్లతో కూడిన పొడి పిచ్‌లపైనా కూడా ఉండగలగడం ఓ బ్యాటర్‌కు ఉండాల్సిన ప్రధాన లక్షణఆలు. కానీ ప్రస్తుతం ఇవి మన బ్యాటర్లలో కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి.
50 వికెట్లు స్పిన్నర్లకే(Teamindia Recent Stats in Spin Bowling) - టీమ్ఇండియా సొంత గడ్డపై వరుసగా టెస్టు సిరీస్‌లు గెలుస్తూ అదరగొడుతోంది. కానీ స్పిన్నర్లపై మాత్రం పైచేయి సాధించలేకపోతోంది. భారత్ చివరిగా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచుల సిరీస్ ఆడింది. అయితే ఇందులో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు హార్ట్‌లీ 22, షోయబ్ బషీర్ 17, రెహాన్ అహ్మద్ 11, రూట్ 8 వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు తీసిన 18 వికెట్లు కూడా స్పిన్నర్లే.
ఆ తర్వాత యశస్వి జైస్వాల్, బుమ్రా, అశ్విన్ రాణించడం వల్ల వరుసగా జట్టుకు నాలుగు విజయాలను అందుకుంది. అయినప్పటికీ ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్‌లో మిగతా బ్యాటర్లు తేలిపోవడం గమనార్హం.
ఇంగ్లాండ్ కన్నా ముందు 2023లో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ ఇండియా ఆడింది. ఇందులో భారత్ 2-1తో విజయం సాధించింది. అయితే ఆసీస్ స్పిన్నర్లు లైయన్ (22), మర్ఫీ (14), కునెమన్ (9) వికెట్లు పడగొట్టారు.
రీసెంట్గా జరిగిన శ్రీలంకలో వన్డే సిరీస్‌లోనూ స్పిన్నర్ల బౌలింగ్‌లో మనోళ్లు పేలవ ప్రదర్శన చేశారు. ఈ సిరీస్‌ను 0-2తో కోల్పోయారు. ఈ సిరీస్‌లో లంక స్పిన్నర్లు 27 వికెట్లు తీశారు. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో స్పిన్నర్ల చేతిలో ఓ జట్టు అత్యధిక వికెట్లు కోల్పోవడం ఇదే మొదటి సారి.
గతంలో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాటర్లు టాప్(Teamindia Senior batter average in Spin Bowling) - గతంలో ప్రత్యర్థి స్పిన్నర్లకు భారత బ్యాటర్లు కొరకరాని కొయ్యల్లా ఉండేవాళ్లు. 2002 నుంచి 2011 వరకు గణాంకాలు పరిశీలిస్తే - స్పిన్ బౌలింగ్ ఆడటంలో(కనీసం 1000 బంతులు) ద్రవిడ్ 85.90, వీరెంద్ర సెహ్వాగ్ 64.71, సచిన్ తెందుల్కర్ 63.30, ధోని 56.07, వీవీఎస్ లక్ష్మణ్ 54.10, గౌతమ్ గంభీర్ 53.05, గంగూలీ 46.07 చొప్పున సగటు నమోదు చేశారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపైనా పరుగుల వరద పారించేవారు. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో దింపి, ఆ తర్వాత పరుగులు చేసి విజయాలను సాధించేవారు. అయితే ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది.
యశస్వి తప్ప మిగతా బ్యాటర్ల పేలవ ప్రదర్శన(Teamindia Batters stats in Spin Bowling) - బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టులో రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, పంత్, కేఎల్ రాహుల్, అక్షర్, జడేజా ఆడే ఛాన్స్ ఉంది. అయితే గత కొన్నేళ్లుగా వీరంతా స్పిన్నర్ల బౌలింగ్‌లో అంతగా ప్రదర్శన చేయట్లేదు.
టెస్టుల్లో స్పిన్నర్ల బౌలింగ్‌లో వీరి గత ఐదేళ్ల ప్రదర్శన పరిశీలిస్తే 35 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ, రోహిత్ 22 సార్లు చొప్పున వికెట్ సమర్పించుకున్నారు. ఈ ఇన్నింగ్స్‌ల్లో విరాట్ 40.82 సగటుతో 898 పరుగులు, రోహిత్ 51 సగటుతో 1122 పరుగులు సాధించారు.
అశ్విన్ (35 ఇన్నింగ్స్‌ల్లో 22 సార్లు), జడేజా (32 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు), శుభ్‌మన్ (30 ఇన్నింగ్స్‌ల్లో 17 సార్లు), పంత్ (24 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు), అక్షర్ పటేల్ (22 ఇన్నింగ్స్‌ల్లో 14 సార్లు) స్పిన్నర్లకు వికెట్లను సమర్పించుకున్నారు. కానీ యశస్వికి మాత్రం మెరుగైన రికార్డు ఉందనే చెప్పాలి. అతడు 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 6 సార్లు మాత్రమే ఔటయ్యాడు. 112.17 సగటుతో 673 పరుగులు సాధించాడు.
ఇక గత మూడేళ్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ 10 సార్లు, విరాట్ 9 సార్లు, రోహిత్ శర్మ 8 సార్లు ఔటయ్యారు. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లీ 11, రోహిత్ 7, జడేజా 11, పంత్ 8, శుభ్‌మన్ 6 సార్లు ఔట్ అయ్యారు.
గతేడాది నుంచి గణాంకాలను పరిశీలిస్తే కోహ్లీ 9 ఇన్నింగ్స్‌ల్లో 8 సార్లు స్పిన్నర్ల చేతికే చిక్కాడు. రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు, జడేజా 14 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు, కేఎల్ రాహుల్ 5 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు, శుభ్‌మన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 9 సార్లు ఔట్ అయ్యాడు.
2015 నుంచి 2019 వరకు టెస్టుల్లో స్పిన్నర్ల బౌలింగ్‌లో టీమ్ బ్యాటింగ్ సగటు 55గా ఉంది. 2020 తర్వాత అది 36కు పడిపోవడం గమనార్హం.
మరి ఈ సారైనా మారుతుందా?(IND VS BAN Spin Bowling) - ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో ప్రత్యర్థి స్పిన్నర్లకు భారత బ్యాటర్లు కాస్త ప్రమాదకరంగా మరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్న చెన్నై, కాన్పూర్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి.
అయితే షకిబుల్ హసన్, మెహిదీ హసన్‌తో పాటు నయీం హసన్, తైజుల్ ఇస్లాం లాంటి నాణ్యమైన స్పిన్నర్లు బంగ్లా జట్టులో ఉన్నారు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో మెహిదీ, షకిబ్ స్పిన్ ద్వయం 15 వికెట్లు తీసింది. ఈ సిరీస్ తర్వాత కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతూ సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో షకిబ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి బంగ్లాదేశ్‌పై టీమ్‌ఇండియాకు అజేయ రికార్డ్ ఉన్నప్పటికీ బంగ్లా స్పిన్నర్లను కాస్త జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి. మరి ఈ టెస్ట్ సిరీస్‌లో స్పిన్ బౌలింగ్‌లో మన బ్యాటర్ల ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.