Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో అటు భారత్, ఇటు పాకిస్థాన్ ఎక్కడా తగ్గట్లేదు. పాకిస్థాన్ తమ దేశానికి రావాలని పట్టు బడుతోంది. బీసీసీఐ రావడం కుదరదని చెబుతోంది. దీంతో ఈ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటన వాయిదా పడుతూనే వస్తోంది. అయితే నవంబర్ 29న దీనికి సంబంధిత జాబితాను విడుదల చేస్తారని క్రికెట్ ప్రియులు అంతా భావించారు. కానీ, మరుసటి రోజుకు ఈ సమావేశం వాయిదా పడింది.
అయితే ఆ రోజు జరగాల్సిన ఐసీసీ భేటీ కూడా జరగలేదు. అది కాస్త నేడు డిసెంబర్ 5కు పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు మరోసారి ఐసీసీ సమావేశాన్ని ఇంకో రెండు రోజులకు వాయిదా వేసినట్లు తెలిసింది. డిసెంబర్ 7న ఈ ఐసీసీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న మొదటి సమావేశం కావడంతో ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Champions Trophy PCB : కాగా, పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025) జరగాల్సి ఉంది. కానీ పాకిస్థాన్‌కు వెళ్లి ఆడేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. భద్రతా కారణాలు సహా ఇతర కారణాలు దృష్ట్యా అక్కడికి జట్టును పంపించమని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్లో ఆడుతామని చెప్పింది. దీంతో పీసీబీకి హైబ్రిడ్ మోడల్ ఆఫర్‌ను అంగీకరించాలని, ఐసీసీ ఆఫర్ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు పీసీబీ మాత్రం ఏ విషయం చెప్పలేదు.
తాజాగా జరిగిన బ్రీఫ్ సెషన్‌లోనూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎదుట హైబ్రిడ్ మోడల్ ఆప్షన్‌ను ఐసీసీ ఉంచినట్లు తెలిసింది. కానీ దీనికి పీసీబీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ దీనికి పీసీబీ అంగీకరించకపోతే మాత్రం ఆతిథ్య హక్కులను వేరే దేశానికి ఇచ్చేయడం ఖాయమని క్రికెట్ వర్గాలు తెలిపాయి. నిజంగానే ఇదే కనుక జరిగితే పాకిస్థాన్ బోర్డుకు ఆర్థికంగా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఎవరు?- క్లారిటీ ఇచ్చేసిన హిట్‌మ్యాన్