2025 Champions Trophy : పాకిస్థాన్ వేదికగా 2025లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి టీమ్ఇండియా పాక్‌కు వెళ్లే ఆలోచనే లేదని బీసీసీఐ తేల్చి చెప్పడం వల్ల టోర్నీ నిర్వాహణ సంక్లిష్టంగా మారింది. మరోవైపు హైబ్రిడ్ మోడల్లో కాకుండా టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పట్టుదలగా ఉంది. దీంతో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్ చేయడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో టోర్నీనే క్యాన్సిల్ చేస్తే మంచిదని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.
టోర్నీకి సమయం దగ్గరపడున్న క్రమంలో ఇప్పటికే 100రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం దిశగా ఐసీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ఖరారు చేయడం ఆలస్యం అవుతున్నందునే కౌంట్‌డౌన్ ప్రారంభించలేదని ఐసీసీ చెబుతున్న మాట. కానీ, ఓవైపు పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోవడం, మరోవైపు టీమ్ఇండియాను పాక్‌కు పంపించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడం వల్ల టోర్నీ నిర్వహణ ఐసీసీకి కష్టంగా మారింది. దీంతో మొత్తం టోర్నీనే రద్దు చేసేందుకు ఐసీసీ మొగ్గు చూపిస్తోందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
'ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆతిథ్యం ఇస్తున్న పాక్‌తోపాటు టోర్నీలో పాల్గొనే ఇరత జట్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. షెడ్యూల్‌పై చర్చిస్తూ ఉన్నాం. నిర్ణయం ఫైనలైజ్ అయ్యాక దానిని అధికారికంగా ప్రకటిస్తాం. ఒకవేళ షెడ్యూలింగ్ కుదరకపోతే టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి' అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ప్రతిపాదనను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. అయితే టీమ్ఇండియా మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన కూడా వచ్చాయి. కానీ, దీనికి పాకిస్థాన్ బోర్డు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే టోర్నీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది.
హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్ బోర్డు తాజా సమాధానమిదే
2025 ఛాంపియన్స్ ట్రోఫీ- దిగివచ్చిన పీసీబీ- హైబ్రిడ్ మోడల్‌కు ఓకే!