Ajay Jadeja Nawanagar Jamsaheb : జామ్ నగర్ రాజ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రాజ కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవం ఉంది. అయితే తాజాగా ఈ రాయల్ ఫ్యామిలీ కీలక ప్రకటన చేసింది. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన కుటుంబ వారసుడిగా ప్రకటించింది. నవానగర్(జామ్ నగర్ పాత పేరు) సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్)గా జడేజా పేరును ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. దీంతో అజయ్ జడేజా నవానగర్ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు.
"పాండవులు తమ 14 సంవత్సరాల అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని విజయం సాధించిన రోజు దసరా. ఈ రోజు, అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ తదుపరి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించినందున నేను కూడా విజయం సాధించినట్లు భావిస్తున్నాను, ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్యూ జడేజా." అని శత్రుసల్యసింహ్జీ అన్నారు.
కాగా, ఒకప్పటి ప్రిన్స్‌లీ స్టేట్ నవానగర్‌నే ప్రస్తుతం జామ్ నగర్‌గా పిలుస్తున్నారు. దేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన వాడే అజయ్ జడేజా కూడా. అతడు క్రికెట్‌పై ఉన్న మక్కువతో మైదానంలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇంకా జామ్ నగర్ కుటుంబంలో గర్వించదగిన గొప్ప క్రికెట్ వారసత్వం ఉంది. ఈ కుటంబానికి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం చేశారు.
అజయ్ జడేజా తన కెరీర్లో మంచి ప్రదర్శన చేసి లెజెండ్‌గా ఎదిగాడు. 1992 నుంచి 2000 వరకు టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 15 టెస్ట్ మ్యాచులు, 196 వన్డేలు ఆడాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్ వచ్చేచోట రెండో పరుగు తీయడం లాంటివి చేయడం అజయ్ జడేజా స్పెషాలిటీ.
బెంగళూరు వేదికగా జరిగిన 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో జడేజా ఆడిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు కేవలం వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలోనే సాధించడం విశేషం.
కేవలం బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అజయ్ జడేజా తనదైన ముద్ర వేశాడు. గాల్లోకి అమాంతం ఎగరి క్యాచ్ పట్టడం, ఒంటి చేతి క్యాచ్‌లు, సింగిల్ స్టంప్ వ్యూ రనౌట్‌లు లాంటివి ఎన్నో చేశాడు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ప్రపంచ క్రికెట్లో మరింత ఎదిగేలా తన అనుభవాన్ని ఉపయోగించి అఫ్గాన్ జట్టును తీర్చిదిద్దుతున్నాడు జడేజా.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ - రోహిత్ దూరమైతే జట్టు ఎదుర్కొనే 3 సమస్యలు ఇవే!
ఉప్పల్ టీ20కు వర్షం పడుతుందా? - క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమ్ ఇండియా!