England Vs Sri Lanka 1st Test Controversy : శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ టెస్టు సందర్భంగా జరిగిన ఓ వివాదం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందువల్లే తమ జట్టు ఓడిపోయిందని శ్రీలంక అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 358 పరుగులు చేయగా, శ్రీలంక 236 పరుగులు చేసింది. అనంతరం 122 పరుగుల తేడాతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లంకకు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. 95 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో శ్రీలకం సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ (65), కుశాల్ మెండిస్ (113) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. శ్రీలంకను 24 పరుగుల ఆధిక్యంలోకి తీసుకొచ్చారు. దాదాపు 25 ఓవర్ల పాటు ఇంగ్లండ్ బౌలర్ల కాచుకున్నారు. అయితే, స్కోరు 146/4 ఉన్నప్పుడు ఇంగ్లండ్ కొత్త బంతిని తీసుకుంది. అంతకుముందు ఉన్న బాల్ షైనింగ్ మాత్రమే పోయిందని, అయినా బంతిని మార్చినట్లు విమర్శలు వచ్చాయి. కొత్త బంతిని తీసుకున్న కాసేపటికే మాథ్యూస్ ఔటయ్యాడు. 78 పరుగులతో మంచి ఊపు మీదున్న మాథ్యూస్ పెవిలియన్‌కు చేరడం వల్ల శ్రీలంక కాస్త ఇబ్బంది పడింది. దీంతో తమ జట్టు ఓడిపోయేందుకు కొత్త బంతే కారణమైందని శ్రీలంక అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బంతి మార్పుపై మాథ్యూస్ కూడా స్పందించాడు.
మాథ్యూస్ ఏమన్నాడంటే?
'బంతి మార్పు సరైంది కాదు. అప్పటి వరకు మేము మెరుగైన స్థానంలో ఉన్నాం. ఎప్పుడైతే కొత్త బంతిని తీసుకున్నారో ఆ జోష్ పోయింది. పిచ్‌కు రెండు వైపులా స్వింగ్ కావడం ప్రారంభించింది. మా బ్యాటర్లకు అది చాలా కష్టంగా మారింది. బంతి పాతబడే వరకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అది మొత్తం మ్యాచ్‌నే మార్చేసింది' అని మాథ్యూస్ వెల్లడించాడు.
ఇక మాథ్యూస్ అనంతరం వచ్చిన కుశాల్ సెంచరీతో ఆదుకొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఏడోస్థానంలో వచ్చి సెంచరీ సాధించిన శ్రీలంక తొలి బ్యాటర్‌గా కుశాల్ రికార్డు సృష్టించాడు. శ్రీలంక నిర్దేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనలో జో రూట్ (62*) అర్ధ శతకం సాధించి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలో అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో రూట్ (64) మూడో స్థానానికి చేరాడు.