Ben Stokes Home Robbery : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని బెన్ స్టోక్సే స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దాదాపు రెండు వారాల క్రితమే ఈ సంఘటన చోటు చేసుకుందని, ఎవరైనా తనకు సాయం చేయాలని కోరాడు. విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. చోరికి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టాడు. అక్టోబర్ 17న నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లోని కాస్టల్ ఈడెన్ ఏరియాలో ఉన్న తన ఇంట్లోకి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వచ్చి దోపిడీకి పాల్పడారని, ఆ సమయంలో తాను పాకిస్థాన్ పర్యటనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. దోపిడి జరిగిన సమయంలో తన భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారని, కానీ వారికి ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించాడు.
"అక్టోబర్ 17 సాయంత్రం, కొంతమంది మాస్కులు ధరించి ఇంట్లోకి ప్రవేశించారు. నగలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. నాకు, నా ఫ్యామిలీకి ఆ వస్తువులతో చాలా అనుబంధం దాగి ఉంది. మరో వాటితో వాటిని రిప్లేస్ చేయలేం. దయచేసి ఎవరైతే ఈ దోపిడి చర్యకు పాల్పడ్డారో వారికి నా విన్నపం ఇదే. ఆ వస్తువులను తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చోరీ సమయంలో నా భార్య, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తూ వారికి ఏం జరగలేదు. శారీరకంగా ఇబ్బంది పడకపోయినా, మానసికంగా మాత్రం ఈ ఘటన వారిని కలవరపరిచింది. అంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు" అని బెన్ స్టోక్స్ రాసుకొచ్చాడు.
అందులో కొన్ని వస్తువులు ఇవే - దోపిడికి గురైన కొన్ని వస్తువుల ఫొటోలను బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అందులో నగలు కూడా ఉన్నాయి. డిజైనర్ బ్యాగ్‌తో పాటు తాను క్రికెట్‌కు అందించిన సేవలకు గౌరవార్థంగా ఇచ్చిన మెడల్ చోరీకి గురైనట్లు తెలిపాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌ను ఇంగ్లాండ్ సాధించడంలో బెన్ స్టోక్స్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. "చాలా వస్తువులను పోగొట్టుకున్నాను. వాటికి విలువ కట్టలేను. ఇప్పుడు ఫొటోలను షేర్ చేయడానికి ఓ కారణం కూడా ఉంది. ఎవరికైనా దొరికితే వాటిని నాకు అందిస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నాను" అని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు.
ఆఖరి సమరంలో పరువు కాపాడుకునేందుకు - 35 మంది నెట్ బౌలర్లతో భారత్ ప్రాక్టీస్!
1 బంతికి 10 పరుగులు- అదీ నెం1 ర్యాంకర్ రబాడ బౌలింగ్‌లో- ఎలా సాధ్యమైందంటే?