Cricketer Anshuman Gaekwad Passed Away : టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ (71) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గైక్వాడ్ ఆత్మకు శాంతి చేకూరాలని బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సహా మిగతా క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
'గైక్వాడ్ మరణవార్త నన్ను బాధిస్తోంది'
సీనియర్ క్రికెటర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, గైక్వాడ్ మరణించారన్న వార్త ఎంతో బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. గైక్వాడ్ కుటుంబ సభ్యులకు సానూభూతి వ్యక్తం చేశారు.
గతకొంతకాలంగా గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అంతేకాకుండా ఆయన చికిత్సకు కావాల్సిన డబ్బు విషయంలోనూ ఆయనకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో పలువురు మాజీ క్రీడాకారులు ఆయన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. చికిత్సకు కావాల్సిన సొమ్మును అందించి ఆదుకోవాలని కోరారు.
ఇందులో భాగంగా బీసీసీఐకి మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ విన్నవించగా, కపిల్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయం గురించి బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన బీసీసీఐ, గైక్వాడ్ చికిత్సకు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది. అంతేకాకుండా తక్షణ సాయం కిందట రూ.కోటి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అయితే అంతలోనే ఆయన చికిత్స పొందుతూ ఇలా కన్నుమూయడం క్రీడాభిమానులకు ఎంతో బాధను కలిగిస్తోంది.
ఇక గైక్వాడ్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, 1974-87 మధ్య భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆయన 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. అందులో మొత్తం 2254 పరుగులు చేశారు. ఇక ఈయన ఖాతాలో రెండు శతకాలు కూడా ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు స్కోర్ చేశారు.
మరోవైపు టీమ్‌ఇండియాకు గైక్వాడ్ రెండుసార్లు హెడ్‌కోచ్‌గా వ్యవహరించారు. 1997-99 మధ్య కాలంలో ఓ సారి కోచ్‌గా వ్యవహరించారు. ఆయన కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్ పొజిషన్లో నిలిచింది. 1990ల్లో నేషనల్ టీమ్ సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగానూ గైక్వాడ్ సేవలందించారు.