Border Gavaskar Trophy IND VS AUS Rohith Sharma : టీమ్ ఇండియా - ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్లో ఈ రెండు జట్లు టాప్ -2లో కొనసాగుతున్నాయి. అందుకే ఈ రెండు జట్లు మధ్య ఏ ఫార్మాట్లో మ్యాచ్ జరిగినా రసవత్తరంగా జరుగుతుంది. అయితే గత ఏడాది 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది ఆస్ట్రేలియా. దీంతో 2024 టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి కొంత వరకు ప్రతీకారం తీర్చుకుంది భారత్. అయితే ఇప్పుడు నవంబర్‌లో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోనూ విజయం సాధించి ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలని భారత్ బలంగా భావిస్తోంది.
కానీ ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు ఇప్పుడు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. మొదటి రెండు టెస్టుల్లో ఒక దానికి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం అందింది. వ్యక్తిగత కారణాలతో అతడు ఒక మ్యాచులో ఆడకపోవచ్చని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. "పరిస్థితిపై పక్కా క్లారిటీ లేదు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల్లో ఒక మ్యాచ్‌లో హిట్ మ్యాన్ ఆడకపోవచ్చు" అని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.
కాగా, నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్ షిప్లో ఫైనల్‌కు మార్గం సుగమం చేసుకోవాలని టీమ్ఇండియా బలంగా భావిస్తోంది. ఇకపోతే 2018-19, 2020-21 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌లను టీమ్ ఇండియా దక్కించుకుంది. ఈ సారి కూడా సిరీస్‌ను దక్కించుకోవాలని, హ్యాట్రిక్ సాధించాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల సిరీస్‌గా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సాగింది. అయితే ఈ సారి మరో టెస్ట్ మ్యాచ్‌ను ఈ సిరీస్‌కు జోడించారు. 1991 - 92 తర్వాత టీమ్ ఇండియా - ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడటం ఇదే మొదటిసారి.
2024-25 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే
- తొలి టెస్టు : నవంబర్ 22-26, పెర్త్ వేదికగా
- రెండో టెస్టు : డిసెంబరు 6-10, అడిలైడ్ (డే/నైట్)
- మూడో టెస్టు : డిసెంబరు 14-18, బ్రిస్బేన్ వేదికగా
- నాలుగో టెస్టు : డిసెంబరు 26-30, మెల్‌బోర్న్ వేదికగా
- ఐదో టెస్టు : జనవరి 3-7, సిడ్నీ వేదికగా
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ మొత్తం ఆస్తులు ఎంతో తెలుసా?
క్రికెటర్లకు రతన్ టాటా ప్రోత్సాహం- కెరీర్‌లో ముందుకెళ్లేలా సాయం