Worship Of Sindhur Ganapati : సాధారణంగా వినాయకుని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఉండవని విశ్వాసం. అందుకే ఏ పూజైనా, వ్రతమైనా గణపతి పూజతోనే ప్రారంభం అవుతుంది. అయితే ఎంత కష్టపడినా చాలీచాలని ఆదాయంతో ఆర్థిక ఇబ్బందులు పడేవారు, ఐశ్వర్యం కోరుకునే వారు ఎలాంటి గణపతిని ఆరాధించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ఏమి చెబుతోందంటే!
జ్యోతిష్య శాస్త్రం ఒక్కో సమస్యకు ఒక్కో గణపతిని పూజించాలని చెబుతోంది. గణపతి విగ్రహాలలో చాలా రకాలున్నాయి. బంగారు, వెండి, ఇత్తడి వంటి లోహాలతో తయారు చేసినవి మాత్రమే కాకుండా పగడం, మరకతం వంటి అమూల్య రత్నాలతో కూడా వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారు. అలాగే తెల్ల జిల్లేడు నారతో, గంధం చెక్క, ఎర్ర చందనం, దేవదారు వంటి అరుదైన కలపతో కూడా వినాయకుని తయారు చేస్తారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు తీరాలంటే ఎలాంటి గణపతిని పూజించాలో ఇప్పుడు చూద్దాం.
సింధూర గణపతి విశిష్టత
గణపతి స్వరూపాలలో అతి ప్రాచీనమైన విశిష్టమైన గణపతి స్వరూపం సింధూర గణపతి. ముఖ్యంగా తమిళనాట ఎక్కువగా సింధూర గణపతిని ఆరాధిస్తారు. సింధూర గణపతిని ఎలా ఆరాధించాలి? ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
సింధూర గణపతి ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది
ఇటు జ్యోతిష్య శాస్త్రంతో పాటు అటు వాస్తు శాస్త్రం కూడా సింధూర గణపతి పూజకు పెద్ద పీట వేసింది. వాస్తు శాస్త్రం ప్రకారం సింధూర గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ ప్రవేశించలేవని తెలుస్తోంది. అలాగే ఆ ఇంట్లో నివసించే వారు ఆర్థిక సమస్యల నుంచి బయట పడటమే కాకుండా ఎనలేని ఐశ్వర్యాన్ని కూడా పొందుతారని నమ్మకం.
సింధూర గణపతిని ఎప్పుడు ప్రతిష్ఠిస్తే మంచిది
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింధూర గణపతిని ఇంట్లో చవితి తిథి రోజు కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ. లేదంటే సంకష్టహర చతుర్థి రోజున కానీ ప్రతిష్టించుకోవచ్చు.
ఇది తప్పకుండా గుర్తుంచుకోండి
ఇంట్లో సింధూర గణపతిని ప్రతిష్టించాలనుకునే వారు గణపతిని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ గణపతికి తొండం ఎడమ వైపుకు ఉండేలా చూసుకోండి. వినాయకుడి విగ్రహం ఎంపిక చేసుకునేటప్పుడు తప్పని సరిగా వినాకుడి తొండం విషయంలో జాగ్రత్త పడాలి. వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటే మనకు శుభ ఫలితాలు సత్వరమే లభిస్తాయని అంటారు. అలా కాకుండా తొండం కుడి వైపుకు తిరిగి ఉంటే కోరికలు నెరవేరడానికి ఆలస్యం అవుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
ఏది ఏమైనా మన పురాణాలలో, వేదాలలో గణపతి పూజ అత్యంత శుభప్రదమని వివరించిన సంగతి మనకు తెలుసు. ఆర్థిక సమస్యలు తొలగించుకొని అష్టైశ్వర్యాలు పొందడానికి మనం కూడా సింధూర గణపతిని పూజిద్దాం.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.