What Do Dreams about Snakes Mean? : మనలో ప్రతి ఒక్కరికీ నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ఈ కలలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని హాయిగా అనిపిస్తే మరికొన్ని మాత్రం భయపెడుతుంటాయి. అందులో ప్రధానంగా చాలా మందికి అప్పుడప్పుడు కలలో పాములు కనిపిస్తుంటాయి. ఇంతకీ ఇలా కలలో సర్పాలు కనిపిస్తే మంచిదా? లేదా అశుభ ఫలితాలేమైనా కలుగుతాయా? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- కలలో అప్పుడప్పుడు వివిధ రకాల జంతువులు కనిపించడం కామన్. అందులో భాగంగానే పాములు కనిపిస్తుంటాయి. అయితే, కలలో సర్పాలు కనిపించే ప్రత్యేకమైన తీరును బట్టి భిన్నమైన ఫలితాలు ఉంటాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అవేంటంటే..
- ఎప్పుడైనా కలలో తెల్లపాము కనిపిస్తే చాలా మంచిదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. ఇలా శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి త్వరగా బయటపడతారట. అలాగే జీవితంలో విజయం సాధిస్తారంటున్నారు.
- కలలో త్రాచుపాము కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనలాభంతో పాటు రాజయోగం కలుగుతుందని చెబుతున్నారు. అదే సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలట.
- కలలో మీకు ఎప్పుడైనా పాము పుట్ట లోపలికి వెళ్తున్నట్లు కనిపిస్తే అది త్వరలోనే ధనయోగం కలుగుతుందనడానికి శుభ సంకేతంగా భావించవచ్చంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
- అలాకాకుండా.. సర్పం పుట్టలో నుంచి బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని స్వప్న సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది.
- కొందరికి పాము చెట్టు ఎక్కినట్లు కలలు వస్తుంటాయి. ఇలా కనిపిస్తే తొందరలోనే జీవితంలో స్థిరపడడమే కాకుండా విశేషమైన ధనలాభం కలుగుతుందని అర్థం చేసుకోవాలట. అదే.. చెట్టు నుంచి కిందకు దిగుతున్నట్లు కనిపిస్తే మాత్రం ధన నష్టం జరుగుతుందని, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుందంటున్నారు!
కలలో జంతువులు కనిపిస్తే అదృష్టమా! దురదృష్టమా! 'స్వప్న శాస్త్రం' ఏం చెబుతోంది?
- కలలో ఎప్పుడైనా దేవాలయంలో పాము ఉన్నట్లు కనిపిస్తే చాలా అద్భుతమైన రాజయోగం పడుతుందట. అంతేకాదు వీరి కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీరుతుంటాయని స్వప్నశాస్త్రంలో పేర్కొనడం జరిగిందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.
- ఇంట్లో పాము ఉన్నట్లు కనిపించినా చాలా మంచిదంటున్నారు. అది చాలా మహిమాన్వితమైనటువంటి కల. తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కలలో పోట్లాడే సర్పాలు కనిపిస్తే వారు భవిష్యత్తులో సమాజిక సమస్యల కోసం పోరాడుతారట.
- ఇకపోతే ఎప్పుడైనా చనిపోయిన పాము కలలో కనిపిస్తే మాత్రం అది దోషం. మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలట. ఇలాంటి సందర్భాల్లో దోష నివారణ కోసం శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిదంటున్నారు. అప్పుడు ఆ కల వల్ల కలిగే చెడు ఫలితాల నుంచి కొంతమేర బయటపడవచ్చంటున్నారు.
- కలలో పాము ఇంటి పైకప్పు నుంచి కింద పడినట్లు కనిపిస్తే ఇంట్లో వాళ్లకు ఏదో ఒక అనారోగ్యం రాబోతుందని అర్థం చేసుకోవాలట. ఈ సందర్భాల్లోనూ దోష నివారణ చేయించుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందంటున్నారు మాచిరాజు కిరణ్.
- పాము అగ్నిలో పడినట్లు కల వచ్చిందనుకో విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది. కానీ, వచ్చిన సంపాదనంతా హారతి కర్పూరంలా కరిగిపోతుందని గ్రహించాలట.
- అదేవిధంగా కొందరికి పాము కోరలు కలలో కనిపిస్తుంటాయి. అలా కనిపిస్తే స్నేహితులు లేదా బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోవాలట. జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
- కొంతమందికి కలలో పాముని చూడగానే భయం వేస్తుంది. అలా అనిపిస్తే మీ స్నేహితులు లేదా బంధువులు మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని గ్రహించాలట. అందుకే ఎప్పుడైనా కలలో సర్పాన్ని చూసి భయపడ్డారనుకో వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించడం మంచిదంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.
Note: పైన తెలిపిన వివరాలు కొందరు జోతిష్య నిపుణులు, జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.