TTD Special Darshan Tickets For July 2024 : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే ఆ ఏడుకొండల వాడిని దర్శించేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. వేలాది మంది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. మరికొందరు ప్రత్యేక దర్శనం చేసుకుంటారు. ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రతినెలా ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలోనే జులై నెల కోటా టికెట్ల బుకింగ్ తేదీలపై ప్రకటన చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు : జులై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటించింది. అలాగే.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వర్చువల్, అంగ ప్రదక్షిణ టికెట్లు: వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఏప్రిల్ 22న మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే.. జులై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన టికెట్లను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు ప్రకటించారు.
దివ్యాంగుల కోటా అప్పుడే: వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం టీటీడీ ప్రత్యేకంగా టికెట్లను విడుదల చేస్తోంది. వీరికి జులై నెల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది.
స్పెషల్ దర్శనం టికెట్లు: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. అదే సమయంలో తిరుమల, తిరుపతిలో జులై నెల గదుల కోటాను ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా టికెట్లు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవకు సంబంధించిన టోకెన్లు, మధ్యాహ్నం ఒంటి గంటలకు పరకామణి సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ స్లాట్స్ ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.