Tiruchanur Brahmotsavam Sarva Bhoopala Vahana Seva : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు అమ్మవారికి ఏ ఉత్సవాలు జరుగనున్నాయి? అమ్మవారు ఏ వాహనంపై ఊరేగనున్నారనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు అలంకార విశేషం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన డిసెంబర్ 3న ఉదయం 8 నుంచి10 గంటల వరకు సర్వభూపాల వాహనంపై అమ్మవారు తిరు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
సర్వభూపాల వాహనం - యశోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరూ రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహన సేవ నుంచి గ్రహించవచ్చు.
ఇదే పరమార్ధం
శ్రీవారి హృదయ పీఠంపై నిలిచి అలమేలుమంగ లోకాన్ని కటాక్షిస్తుంటే, సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. సర్వభూపాల వాహన సేవ సందర్భంగా వీరంతా జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరించడమే ఈ వాహన సేవలోని పరమార్ధం.
భగవత్ సేవకు అంకితం
విష్ణు అంశ లేనివాడు రాజు కాలేడు. 'రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే' అని వేదాలలో వర్ణించినట్టుగా శ్రీహరి రాజాధి రాజు. రాజాధిరాజైన శ్రీహరి అర్ధాంగిని సర్వ భూపాలురు వాహన స్థానీయులై తమ భుజస్కందాలపై మోస్తున్నారు. భూపాలకులందరూ అధికార సంపన్నులే. అధికారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే వారు భగవత్ సేవకు అంకితం కావాలి. ఈ దివ్యమైన సందేశాన్ని సర్వభూపాల వాహన సేవ మానవాళికి ఇస్తోంది.
సర్వభూపాల వాహన సేవ దర్శనఫలం
సర్వ భూపాల వాహనంపై విహరించే శ్రీ పద్మావతి దేవిని దర్శిస్తే కీర్తి, యశస్సు, పదవీ యోగం కలుగుతాయని శాస్త్ర వచనం. అందుకే బ్రహ్మోత్సవాలలో ఈ వాహన సేవకు అంతటి విశిష్టత ఉంది.
స్వర్ణ రధోత్సవం
ఇదే రోజు సాయంత్రం సాయంత్రం 4.20 గంటల నుంచి అమ్మవారు స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుచానూరు ఆలయ మాడ వీధుల్లో జరిగే ఈ ఉత్సవంలో కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తారు. అసంఖ్యాక భక్తజనం ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి స్వర్ణరథాన్ని లాగుతూ తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ, స్వర్ణ రథం పై విహరించే శ్రీ పద్మావతీ దేవికి నమస్కరిస్తూ ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.