Simhachalam Chandanotsavam 2024 : దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయముగా సింహాద్రి అప్పన్న దేవాలయం విరాజిల్లుతోంది. అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విశేషాలను చూద్దాం.
సింహాద్రి అప్పన్న దేవస్థానం విశాఖపట్టణానికి 11 కి.మీ.దూరంలో తూర్పు కనుమల్లో, సముద్రమట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై వెలసింది. ప్రకృతి రమణీయతల మధ్య వెలసిన ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనది.
సంవత్సరానికి 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలోని శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ నాడు జరుగుతుంది.
స్థల పురాణం
చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహ స్వామి కనిపించాడు. ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారు. నరసింహ స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు.
స్వయంభువు నారసింహుడు
భారత ఇతిహాసాల ప్రకారం సింహాచలం అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ వెలసిన స్వామి స్వయంభువు అని శాస్త్ర వచనం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో నాల్గవదైన లక్ష్మీ నరసింహ స్వామి అర్చావతారంగా వెలిశాడని ప్రతీతి. శ్రీమహావిష్ణువుకు బద్ద వైరి హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఈ కొండపైన సేదదీరినట్లుగా శాసనాల ద్వారా తెలుసస్తోంది. ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహ స్వామి విగ్రహాన్ని ఆరాధించినట్లుగా మనకు తెలుస్తుంది.
ఆలయ విశేషాలు
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. కొండ మీద నుంచి గాలి గోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.
సంతానయోగాన్ని కలిగించే కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్టితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామి వారికి భక్తులు ఇక్కడే కప్పాలు అంటే పన్నులు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు. కాలక్రమేణా అది కప్ప స్తంభం అయింది.
జల ధారలు
సింహగిరిపై గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార అనే సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. భక్తులు ఈ ధారల్లో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు.
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.
సింహగిరిపై విశేష పూజలు
చందనోత్సవం: సింహాచలంలో స్వామివారికి ముఖ్యంగా వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగే చందనోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది.
గిరిప్రదక్షిణ
సింహగిరికి అక్షయ తృతీయ రోజు భక్తులు విశేషంగా గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆశ్చర్యమేమిటంటే మండు వేసవిలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి స్వామి దయ వలన ఉరుములు, మెరుపులతో కుండపోతగా వర్షం కురుస్తుంది.
అలాగే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల వద్ద ప్రారంభించి, కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శించుకుంటారు. ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమి అని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు. కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. 32 కి .మీ వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు, మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు.
ఈ అక్షయ తృతీయ రోజున అంత దూరం వెళ్లి సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకోగలిగిన వాళ్లు అదృష్టవంతులు. వెళ్లలేని వారు మనసులోనే ఆ అప్పన్నకు మనసారా నమస్కరించుకుందాం.
ఓం నమో నారసింహాయ నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనాలా? లేకుంటే ఏమవుతుంది? - AKSHAYA TRITIYA 2024
గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక కథేంటో తెలుసా? - why do we offer grass to ganesha