Significance of 108 Number in Sanatana Dharma : హిందూ ధర్మ శాస్త్రంలో 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. మనం పవిత్రంగా భావించే ఉపనిషత్తుల సంఖ్య 108. పూజలో ప్రతి దేవుడికీ అష్టోత్తర శతనామావళి చదువుతారు. ఆ మంత్రాలను జపించేందుకు ఉపయోగించే జపమాలలో 108 పూసలు ఉంటాయి. అంతేకాదు.. ఏదైనా కోరిక కోరుకునేటప్పుడు అది నెరవేరితే.. గుడిలో 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటారు. 108 ప్రదక్షిణలు చేయాలని అంటుంటారు. ఇలా సనాతన సంస్కృతిలో ఎక్కడ చూసినా 108 సంఖ్య(108 Number) గురించే ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ధర్మశాస్త్రాల్లో 108 అంతటి ప్రాముఖ్యత కలిగి ఉండడానికి కారణాలేంటి? హిందూ మతంలో ఆ సంఖ్యనే ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే!
సంపూర్ణతను సూచిస్తుంది : హిందూ మతంలో 108 పూర్తి సంపూర్ణతను సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి మరణం వరకు ఒక వ్యక్తి జీవితంలో గడపగలిగేవన్నీ ఈ నంబర్లో ఉంటాయి. 108లో 1 అంటే.. ప్రారంభ సంఖ్య, 0 అంటే.. శూన్యం, దైవం, 8 అంటే.. అనంతం(అంతం లేనిదని అర్థం). ఈ అర్థాలన్నీ సమష్టిగా ఆత్మ శాశ్వతమైన ప్రయాణాన్ని, జీవితం, మరణం మధ్య మారుతున్న స్వభావాన్ని తెలియజేస్తాయట.
దైవానికి దగ్గరగా చేస్తుందట! : హిందూ మతంలో మంత్రాలు, ప్రార్థనలు లేదా శ్లోకాలు పఠించడాన్ని "జపం" అని పిలుస్తారు. పవిత్ర శబ్దాలు లేదా పదాలను బిగ్గరగా పఠించడం ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించడానికి సహాయపడుతుందని చెప్తారు. మొత్తం ధ్యాన చక్రం 108 మంత్రాలని జపించిన తర్వాతే పూర్తవుతుందని భావిస్తారు. 108 సార్లు మంత్రం జపించిన ప్రతిసారీ ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి దగ్గర అవ్వడమే కాకుండా దైవత్వానికి దగ్గరవుతామని నమ్ముతారు.
వేద జ్యోతిష్యశాస్త్రంలో 108 ప్రాధాన్యత : వేద జ్యోతిష్యశాస్త్రంలో కూడా 108 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు తొమ్మిది గ్రహాలు, పన్నెండు రాశులు ఉన్నాయి. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే(12 x 9) వచ్చే సంఖ్య 108. ఈ సంఖ్యా సంబంధం.. విశ్వం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది, నక్షత్రాలు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది. అలాగే, 108 సంఖ్య అన్ని రేఖాగణిత నమూనాలు, ఆకృతులలో ఉందని చూపిస్తుంది. దీన్నిబట్టి ఏ జామెట్రీకైనా 108 సంఖ్య ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.
లక్ష్మీదేవికి 108 రూపాయి నాణేలతో పూజ- శుక్రవారం రోజు మహిళలు ఇలా చేస్తే కనక వర్షమే!
భూమి, సూర్యుడు, చంద్రుని మధ్య దూరం : 108 సంఖ్య భూమి, సూర్యుడు, చంద్రుని మధ్య సగటు దూరాన్ని తెలియజేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే భూమికి, చంద్రుడికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరాన్ని లెక్కించిన మన పూర్వీకులు 108 ప్రాధాన్యతను ఆనాడే గుర్తించారు. అదేంటంటే.. సూర్యుడి చుట్టు కొలతతో 108 సంఖ్యను గుణిస్తే భూమికి, సూర్యుడికి మధ్య దూరం లెక్కకట్టవచ్చు. అదేవిధంగా.. చంద్రుడి చుట్టుకొలతను 108 సంఖ్యతో గుణిస్తే భూమికి, చంద్రుడికి మధ్య డిస్టెన్స్ లెక్క తేలుతుంది.
శరీరంలోని ప్రధాన చక్రాలతో సంబంధం : యోగా ప్రకారం.. మానవ శరీరంలో ఏడు ప్రధాన చక్రాలు లేదా శక్తి కేంద్రాలు ఉంటాయి. ఒక వ్యక్తి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును నిర్వహించడం ఈ చక్రాలపై ఆధారపడి ఉంటుంది. 108 సంఖ్య ఈ శక్తి కేంద్రాలకు దగ్గరి సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. ప్రాణం లేదా ప్రాణశక్తి.. చక్రాలను కలిపే 108 శక్తి మార్గాలు లేదా నాడుల ద్వారా నడుస్తుంది. ఆధ్యాత్మిక సమతుల్యత, అవగాహనను సాధించడానికి ఈ శక్తులను సమలేఖనం చేయడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ఆయుర్వేదంలో 108 ప్రాధాన్యత : ఆయుర్వేద శాస్త్రంలో కూడా 108కి ప్రాధాన్యం ఉందని తేలింది. ఆయుర్వేదశాస్త్రం ప్రకారం.. మన శరీరంలో 108 ఆయువు పట్లు(మర్మస్థానాలు) ఉంటాయి. వీటి ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. ఈ ఆయువు పట్లలో ఏర్పడిన సమస్యను గుర్తించి పరిష్కరిస్తే ఆరోగ్య సమస్యలు తీరుతాయని భావిస్తారు.
ఎంత కష్టపడ్డా ఫలితం లేదా? అనేక సమస్యలు ఉన్నాయా? వాస్తు ప్రకారం ఇలా చేస్తే అంతా సెట్!