Shravana Masam 2024 : శ్రావణమాసం నోములకు పూజలకు పుట్టినిల్లు. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.
దివ్యమైన మాసం శ్రావణ మాసం
వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే శ్రావణమాసం లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా శ్రావణ మాసం గురించి పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.
శివారాధనకు ఎంతో విశిష్టత
దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. శ్రావణమాసంలో అన్ని సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం.
సుమంగళి భాగ్యాన్నిచ్చే మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళ గౌరీ నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే మొదటి శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టి శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి.
పండుగలు - శుభదినాలు
- నాగపంచమి :శ్రావణమాసం శుద్ధ పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసాలు ఉండి నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోయడం వంటివి భక్తి శ్రద్దలతో చేస్తే కుజ దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.
- శ్రావణ శుద్ధ షష్టి రోజున సంపూర్ణమైన ఆరోగ్యం కోసం 'సూపౌదన వ్రతం' ఆచరిస్తారు. ఇదే రోజున కల్కి జయంతి కూడా జరుపుకోవడం విశేషం.
- ఆగష్టు 11న వచ్చే భాను సప్తమి సూర్య ఆరాధనకు విశిష్టమైనది.
- ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటాం.
- ఆగస్టు 16వ తేదీ పుత్రదా ఏకాదశి రోజు శ్రీ విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు.
- ఆగస్టు 16వ తేదీ శ్రీ వర మహాలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాం. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మీ వ్రతం విశిష్టమైనది. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి.
- ఆగస్టు 17వ తేదీ దామోదర ద్వాదశి, ఇదే రోజు శని త్రయోదశిని కూడా జరుపుకుంటాం.
- ఆగస్టు 19వ తేదీ శుక్ల పక్ష పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధన్ జరుపుకుంటున్నాం. ఇదే రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ దినం.
- యజ్ఞోపవీత పౌర్ణమి
- శ్రావణ పౌర్ణమి రోజు జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. వేదభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు.
- ఆగస్టు 20న శ్రావణ బహుళ కృష్ణపాడ్యమి రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం.
- ఆగస్టు 21న శ్రావణ బహుళ విదియ రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనగా జరుపుకుంటాం.
- ఆగస్టు 24న శ్రావణ బహుళ చవితి రోజు సంకష్టహర చవితిగా జరుపుకుంటాం.
- ఆగస్టు 24న తేదీ శ్రావణ బహుళ పంచమి రోజు బలరామ జయంతిగా జరుపుకుంటాం.
- ఆగస్టు 26న తేదీ శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణుని జన్మ దినం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం.
- ఆగస్టు 29న శ్రావణ బహుళ ఏకాదశిని అజా ఏకాదశిగా జరుపుకుంటాం.
- ఆగస్టు 31న శ్రావణ బహుళ త్రయోదశిని శని దోషాలను పోగొట్టే శని త్రయోదశిని జరుపుకుంటాం.
- సెప్టెంబర్ 1న శ్రావణ బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి పర్వదినం.
- సెప్టెంబర్ 2న తేదీ శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటాం.
ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ శ్రావణ మాసంలో శాస్త్రాలలో చెప్పిన విధంగా పూజలు, వ్రతాలు, నియమాలు ఆచరించి సకల శుభాలు అనంత సౌభాగ్యాలు పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
చాతుర్మాసంలో ఇలా చేస్తే సకలైశ్వర్యాలు సిద్ధి - వ్రత కథ విన్నారా? - Chaturmas Vrat Katha
పేద వారిని కూడా ధనవంతులను చేసే గురు ప్రదోష వ్రతం! ఎలా చేసుకోవాలో తెలుసా? - Guru Pradosh Vrat 2024