Pancha Bhoota Linga Temples : హిందూ సంస్కృతిలో పరమేశ్వరుని లింగ రూపంలో పూజిస్తారు. భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో తీర్థయాత్ర పర్యటనల్లో పంచ భూత లింగాల సందర్శనకు ఎంతో ప్రాధాన్యత ఉంది.
పంచభూతలింగాలంటే!
ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకలు ఈ పంచభూత లింగాలు. అవి ఆకాశ లింగం, పృథ్వి లింగం, అగ్ని లింగం, జలలింగం, వాయు లింగం. వీటిలో మొదటిది ఆకాశలింగం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆకాశలింగం చిదంబరం
ఈ రోజు మనం పంచభూతలింగాలలో మొదటిది ఆకాశలింగం అయిన చిదంబరం క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
చిదంబరం విశిష్టత
తమిళనాడు రాజధాని చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు వింతలూ ఉన్నాయి. పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి.
నిరాకారం - నిర్గుణత్వం
చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని గర్భగుడిలో మనకు శివలింగం కానీ, ఎలాంటి విగ్రహం కానీ కనిపించవు. భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపించినప్పుడు అప్పుడు అక్కడ ఒక గోడ మాత్రం కనిపిస్తుంది. భక్తులు దానినే శివ స్వరూపంగా భావించి దర్శించి తరిస్తారు. దీని వెనుక దాగి ఉన్న నిగూఢ అర్ధమేమిటంటే చిదంబరంలో వెలసిన స్వామి ఆకాశ లింగానికి ప్రతీక. ఆకాశమంటే శూన్యం ఏమి లేనిదని అర్థం. అందుకే స్వామి ఇక్కడ నిరాకార స్వరూపం ఏ ఆకారం లేని వానిగా ఉంటాడు. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే.
ఆకాశ తత్వానికి ప్రతీక
పంచ భూతాలలో ఒకటైన ఆకాశ తత్త్వానికి ప్రతీకగా భావించే ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుకభాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు అక్కడి పూజారులు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్నే 'శివోహంభవ' అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపం లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యమని పండితులు చెబుతారు. బహుశా అందుకేనేమో అంతు పట్టని విషయాల గురించి 'అది చిదంబర రహస్యమనే' మాట వాడుకలోకి వచ్చింది.
ఒళ్లు జలదరించే దివ్యానుభూతి
చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. అదేమిటంటే ఎవరైతే ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శనం చేసుకుని బయటికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది.
నవ రంధ్రాలకు ప్రతీక నవమార్గాలు
ఈ గుడిలోని మరో ప్రత్యేకత ఏంటంటే దేవాలయానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవ రంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. అలాగే ఈ ఆలయంలో "కనక సభ"లో 4 స్తంభాలు, 4 వేదాలకు ప్రతీకలు అని పండితులు చెప్తారు. పొన్నాంబళంలో ఉండే 28 స్తంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు. ఇక్కడి 9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు. ఆ పక్కనే ఉన్న మంటపంలోని 18 స్తంబాలు 18 పురాణాలకు ప్రతీకలు. నటరాజు భంగిమను పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డ్యాన్స్ అని అభివర్ణించారు. మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతాలని నిరూపించేందుకు పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఎనిమిదేళ్లకు పైగా సమయం పట్టడం గమనార్హం.
ఆలయ స్థల పురాణం
చిదంబరం స్థల పురాణం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి బయలుదేరి వెళ్లాడంట! ఆ వనంలోని ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగలిగిన శక్తి కలిగిన వారంట! శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటుండగా, ఆ సమయంలో పార్వతి కూడా శివుని వెంబడించింది. అంతట ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబరధారి అయిన పరమశివుని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు.
సర్వం శివోహం
తమ భార్యలూ, ఇతర స్త్రీజనం కూడా శివుని పట్ల మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేయగా భిక్షువు రూపంలో ఉన్న సర్వేశ్వరుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. దానితో ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేయగా శివుడు దాని చర్మం వలిచి నడుముకి వస్త్రంగా ధరించాడు. ఇక పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన, అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు.
నటరాజ మూర్తికి దాసోహమన్న ఋషులు
అంతటా ఋషులు పరమశివుని భగవంతుడిగా గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు. ఆనాటి నుంచి పరమశివుడు చిదంబరంలో నటరాజ మూర్తిగా పూజలందుకుంటున్నాడు. ఇప్పటికి తమిళనాడులో బాలబాలికలు నృత్యం అభ్యసించిన తర్వాత తమ తొలి ప్రదర్శన అంటే ఆరంగ్రేటం చిదంబర ఆలయంలోనే జరపడం సంప్రదాయంగా వస్తోంది.
ఎలా చేరుకోవచ్చు
దేశం నలుమూలల నుంచి చెన్నై చేరుకోవడానికి రైలు, విమానం, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. చెన్నై నుంచి చిదంబరంకు రైళ్లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి.
దర్శనం మాత్రాన్నే మానవులు సకల పాపాలు పటాపంచలై మోక్షాన్ని ఇచ్చే చిదంబరం క్షేత్రాన్ని మనందరం కూడా దర్శిద్దాం తరిద్దాం.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.