Pedda Sesha Vahanam Tirumala Significance : కలియుగ ప్రత్యక్ష దైవంగా భూమిపై అవతరించిన వేంకటేశ్వరుడు సాక్షాత్తూ ఆ వైకుంఠనాధుడైన శ్రీ మహావిష్ణువే అని బ్రహ్మాండ పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. వైకుంఠంలో స్వామి నిత్యం పవళించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని విశ్వాసం. అందుకే స్వామివారు తొలిరోజు పెద్ద శేషవాహనంపై ఊరేగుతాడు.
దాస్యభక్తికి నిదర్శనం
శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది.
ఆది శేషువే తొలి వాహనం
నిరంతరం శ్రీనివాసుని సేవలో తరించే ఆదిశేషువునే బ్రహ్మోత్సవాల్లో తొలి వాహనంగా చేసుకోవడం భగవంతుని కరుణాముద్రకు తార్కాణం. అందుకే పదకవితా మహుడు అన్నమయ్య తన కీర్తనల్లో తిరుమల కొండలను పదివేల శేషుల పడగల మయమని వర్ణించాడు.
అంతా శేషుడే!
పెద్ద శేష వాహన సేవలో విశేషమేమిటంటే, స్వామి వారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగిస్తారని పండితులు చెబుతున్నారు. నిత్యం స్వామిసేవలో ఉండే ఆదిశేషునిపై శ్రీవారిని వీక్షించడం ఎంతో పుణ్యదాయకమని, సౌభాగ్య దాయకమని భక్తుల విశ్వాసం. ఆదిశేషువుపై విహరించే ఏడుకొండవానికి నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.