Masa Shivaratri Pooja Vidhanam In Telugu : వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం మాస శివరాత్రి పూజ చాలా విశిష్టమైనది. ముఖ్యంగా శ్రావణ మాసంలో అమావాస్యకు ముందు వచ్చే మాస శివరాత్రి రోజు నియమానుసారం శివారాధన చేస్తే దీర్ఘ కాలంగా పీడిస్తున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఈసారి మాసశివరాత్రి ఆదివారం కలిసి రావడం వల్ల ఆరోగ్యం కోరుకునే వారు ఈ పూజను తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి అంటే?
అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. అయితే ఇక్కడ చతుర్దశి తిధి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటాం.
మాస శివరాత్రి ఎప్పుడు?
సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం మాస శివరాత్రి జరుపుకోవాలి.
మాస శివరాత్రి పూజకు శుభ సమయం?
సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు మాస శివరాత్రి పూజకు శుభ సమయమని పండితులు చెబుతున్నారు.
మాస శివరాత్రి పూజా విధానం
మాస శివరాత్రి రోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో శివలింగం ఉంటే పంచామృతాలతో శివయ్యను అభిషేకించాలి. తర్వాత శివాష్టకం పఠిస్తూ తుమ్మి పూలతో కానీ, నీలం శంఖు పూలతో కానీ, మారేడు దళాలతో కానీ ఈశ్వరుని పూజించాలి. కొబ్బరికాయలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ హారతులు, కర్పూర నీరాజనాలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి.
సంధ్యాసమయం పూజ
సాయంత్రం సంధ్యా సమయం అయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో పూజ పూర్తి చేసుకుని సమీపంలోని శివాలయానికి వెళ్లి ఆలయంలో జరిగే శివాభిషేకాలు, అర్చనలలో పాల్గొనాలి. శివునికి 11 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం పూజారికి దక్షిణ తాంబులాలు ఇచ్చి నమస్కరించుకోవాలి.
ఉపవాస విరమణ
శివాలయం నుంచి ఇంటికి వచ్చి ఒక అతిథికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే మాస శివరాత్రి పూజ సంపూర్ణం అవుతుంది.
మాస శివరాత్రి పూజాఫలం
భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మాస శివరాత్రి రోజు శివారాధన చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా అమావాస్య ముందు కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టడం, తీవ్రమవడం జరుగుతూ ఉంటుంది. అందుకే అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజు చేసే మాస శివరాత్రి పూజ అనారోగ్య సమస్యలను పోగొట్టి దీర్ఘాయుష్షును ఇస్తుందని లింగ పురాణంలోను, శివ మహా పురాణంలో వివరించారు.
మొండి రోగాలు మాయం
ఈసారి మాస శివరాత్రి ఆదివారం రావడం మరీ విశేషమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే రేపు రానున్న ఆదివారం రోజు భక్తిశ్రద్ధలతో శివయ్యను ఆరాధిస్తే ఎంతటి మొండి రోగాలైన తొలగిపోతాయి. ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.