Dhanvantari Jayanthi : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. జీవితంలో ఎంత ఐశ్వర్యమున్నా ఆరోగ్యం లేకుంటే ఏదీ అనుభవించలేము. షడ్రసోపేతమైన భోజనం కళ్ళెదురుగా ఉన్నా, ఒంట్లో అనారోగ్యం ఉంటే ఏమి ఫలం చెప్పండి? అందుకే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవాలను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత, అపమృత్యుదోషాన్ని నివారించే ధన్వంతరి జయంతి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ధన్వంతరి జయంతి
క్షీరసాగర మథన సమయంలో అమృత భాండ కలశంతో పాలసముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు అవతారమే ధన్వంతరి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. కాబట్టి ఆ రోజును మనం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి, సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని తెలుస్తోంది.
ధన్వంతరి జయంతి ఎప్పుడు?
అక్టోబర్ 30వ తేదీ బుధవారం సూర్యోదయంతో ఆశ్వయుజ బహుళ త్రయోదశి తిథి ఉంది. కాబట్టి ఆ రోజునే ధన్వంతరి జయంతిని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం.
ధన్వంతరి పూజా విధానం
ఈ రోజు వేకువనే నిద్రలేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి, శ్రీమహావిష్ణువు స్వరూపమైన ధన్వంతరి చిత్రపటాన్ని గంధ పుష్పాక్షతలతో పూజించి యథాశక్తి నైవేద్యాలను సమర్పించాలి. ఇప్పుడు ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథను తెలుసుకుందాం.
ధన్వంతరి జయంతి వెనుక ఉన్న పురాణ గాథ
పోతన మహాకవి రచించిన భాగవతం అష్టమ స్కంధంలో వివరించిన ప్రకారం, క్షీరసాగరమథన సమయంలో అమృతం ఉద్భవించే ముందు హాలాహలం పుట్టింది. దానిని పరమశివుడు సేవించాడు. అలాగే వరుసగా కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అవతరించి విష్ణువు వక్షో భాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
ధన్వంతరి స్వరూపం
సాగర గర్భం నుంచి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబు కంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణి కుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని ధరించి ఆవిర్భవించాడు. అతను విష్ణు దేవుని అంశ వలన పుట్టిన వాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని నామకరణం చేశారు.
ధన్వంతరి వంశస్తుడే కాశీరాజు
పురూరవ వంశ క్రమంలోని కాశీరాజు ధన్వంతరి క్షీర సాగరం నుంచి ఉద్భవించిన ధన్వంతరి వంశస్తుడు అని అతనికి ఆయుర్వేద ప్రవర్తకుడని పేరున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంతేకాదు ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం కూడా ఉంది.
ఆయుర్వేదం
ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా విభజించాడు. అవి:
- కాయ చికిత్స (Internal Medicine)
- కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
- భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
- శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
- శల్యతంత్ర (Surgery)
- విషతంత్ర (Toxicology)
- రసాయన తంత్ర (Geriatrics)
- వశీకరణ తంత్ర (The therapy for male sterility, impotency and the promotion of virility)
ధన్వంతరి ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే!
ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందిన ధన్వంతరికి మన దేశంలో ప్రత్యేకంగా ఆలయాలు కనిపించడం అరుదు. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఆవరణలో ఒక ధన్వంతరి మందిరంలో నిత్య పూజలు జరుగుతాయి. మందిరం వద్దనున్న శిలాఫలకం ప్రకారం అది 12వ శతాబ్దానికి చెందినది. అప్పటి గొప్ప ఆయుర్వేద వైద్యుడు గరుడ వాహన భట్టార్ ఈ మందిరంలో మూర్తిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది. ఇక్కడ తీర్థంగా కొన్ని మూలికల రసం (కషాయం) ఇస్తారు. ఈ కషాయాన్ని సేవిస్తే ఎంతటి మొండి రోగాలైన నయమవుతాయని విశ్వాసం. దేశవిదేశాల నుంచి కూడా ఈ కషాయం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
కేరళలో ధన్వంతరి గుడి
కేరళలోని గురువాయూర్, త్రిస్సూర్‌లకు మధ్య 20 కి.మీ. దూరంలో "నెల్లువాయ" అనే గ్రామంలో ఒక ధన్వంతరి గుడి ఉంది. ఇది గురువాయూర్ దేవస్థానం అంత పురాతనమైనదని భావిస్తారు. చాలా మంది ఆయుర్వేద వైద్యులు తమ చికిత్సా వృత్తి ప్రారంభించే ముందు ఈ మందిరాన్ని దర్శిస్తుంటారు.
కాలికట్‌లో వెలసిన ధన్వంతరి క్షేత్రం
కేరళలోనే కాలికట్ పట్టణం పరిసరాలలో ఒక "ధన్వంతరి క్షేత్రం" ఉంది. ఈ మందిరం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందుతున్నది. ఎంతో మంది వ్యాధి నివారణకు, మంచి ఆరోగ్యానికి ఇక్కడి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు.
తెలుగు రాష్ట్రంలో ఇక్కడే!
ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చింతలూరులో ప్రసిద్ధమైన ధన్వంతరి భగవానుని దేవాలయం ఉంది.
కన్నడనాట ధన్వంతరి ఆలయం
కర్ణాటకలో బెంగళూర్‌లోని యశ్వంతపురలోని గాయత్రి దేవస్థానంలో ధన్వంతరి దేవాలయం ఉంది.
ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి హోమాలు
మన దేశంలో అనేక ఆలయాలలో అనారోగ్యంతో బాధింపడే వారికి తిరిగి స్వస్థత కలిగించడం కోసం ధన్వంతరి హోమాలు జరుగుతూ ఉండడం మనకు తెలుసు. అంతటి గొప్ప ధన్వంతరి జయంతి రోజు ఆయన నామస్మరణ చేయడం ద్వారా మనం కూడా దీర్ఘాయువు, ఆరోగ్యమనే అమూల్యమైన ఐశ్వర్యాలను పొందుదాం.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
ధన్వంతరయే అమృత కలశ హస్తాయ వజ్ర జలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః అంటూ ఆ ధన్వంతరిని ప్రార్థిస్తే ఆరోగ్యానికి లోటుండదు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.