Kedareswara Vratham Katha In Telugu : అన్యోన్య దాంపత్యానికి చిహ్నమైన ఆది దంపతులను ఆరాధించి కేదారేశ్వర వ్రతం ఆచరించుకున్న వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. శ్రీ కేదారేశ్వర వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ కేదారేశ్వర వ్రత కథ
పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మునులు భార్య భర్తలు ఆదిదంపతుల వలే అన్యోన్యంగా ఉండాలంటే ఏ వ్రతాన్ని ఆచరించాలని సూత మహామునిని కోరగా సూత మహాముని శౌనకాది మునులతో ఇలా చెప్పసాగాడు.
సూత ఉవాచ
పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందడానికి ఆచరించిన కేదారేశ్వరుని వ్రతం గూర్చి చెబుతాను శ్రద్ధతో వినవలసిందని సూతుడుశౌనకాదులకు చెప్పెను.
మహేశ్వరుని మహాసభ
పూర్వం శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభలో కొలువుదీరి ఉండెను. సిద్ధ సాధ్య, కింపురుష యక్ష్మ గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు మొదలగు వారందరు ఆ సభలో ఉన్నారు.
శివలీలా వినోదం
నారద తుంబురాదులు శివ లీలను గానం చేస్తున్నారు. ఆ గానామృతానికి రసాల, సాల, తమాల, వకుళ, నారికేళ, చందన, పనస, జంబూవృక్షములతోను చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతో మణిమయ మకుట కాంతులతో విరాజిల్లే నదీనదపర్వతములతోను చతుర్దశభువనాలు పులకిస్తున్నాయి.
భృంగురిటి ఆనంద నాట్యం
ఆనందోత్సాహాలతో కొనసాగుతున్న ఆ సభలో భృంగురిటి అను శివ భక్తి శ్రేష్టుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. భృంగురిటి తన నాట్యగతులతో శివుని మెప్పించసాగాడు. అందుకు పరమానందంతో పరమశివుడు పార్వతిని వీడి సింహాసనము నుంచి లేచి భృంగురిటిని తన అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనుగా వందిమాగధులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు.
శివుని ప్రశ్నించిన పార్వతి
వందిమాగధులు శివునికి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం చూసిన పార్వతి శివుని చేరి "నాథా! నన్ను విడిచి మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుంచి నన్ను వేరుపరచి ఇలా ఎందుకు చేశారు" అని ప్రశ్నించెను.
పార్వతిని సమాధానపరచిన శివుడు
పార్వతి బాధను అర్థం చేసుకున్న ఆ సదాశివుడు "దేవీ! పరమార్ధవిదులగు యోగులకు నీ వలన ప్రయాజనం ఉండదని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు" అని జవాబిచ్చాడు.
ఆగ్రహించిన తపస్సుకేగిన పార్వతి
శివుని మాటలకూ పార్వతి కోపంతో సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి వందిమాగధులు ప్రణామములకు నోచుకోని అయోగ్యురాలనా నేను! అని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను సాధించుకోడానికి తపస్సు చేయడానికి నిశ్చయించుకుని, కైలాసమును వదలి సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి చేరుకుంది.
ఆశ్రమ వాసుల ఆహ్వానం
గౌతమ మహర్షి ఆశ్రమవాసులు పార్వతిని చూసి ఆమె వివరాలు అడుగగా తాను పార్వతీ దేవినని, సాక్షాత్తు పరమశివుని ఇల్లాలు అని చెప్పింది పార్వతి. అప్పుడు పార్వతి దేవి గౌతమ మహర్షి నమస్కరించి తన భర్త పరమశివునితో సమానమైన యోగ్యతను కల్పించే వ్రతాన్ని ఉపదేశించమని కోరగా గౌతముడు కేదారేశ్వర వ్రతం ఆచరిస్తే తప్పకుండా పార్వతి కోరిక తీరుతుందని చెప్పి ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా తెలియజేసి తానే స్వయంగా పార్వతి దేవిచే ఆ వ్రతాన్ని ఆచరింపజేసాడు.
శివునిలో సగభాగం పొందిన పార్వతి
గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా, భక్తితో చేసింది. అంతట పరమేశ్వరుడు సంతోషించి పార్వతీదేవి కోరిక ప్రకారం తన మేనులో సగ భాగము పార్వతికి అనుగ్రహించెను. ఆనాటి నుంచి శివుడు అర్ధనారీశ్వరుడుగా ఖ్యాతికెక్కాడు. ఆ జగదాంబ సంతోషంతో తన భర్తతో కలిసి కైలాసమునకేగెను.
కేదారేశ్వర కథా శ్రవణ ఫలం
కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి ఈ వ్రత కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకుంటే దంపతుల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. జీవితాంతం ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని ఫలశ్రుతి. ఓం ఉమామహేశ్వరాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.