Police seize Ganja in lorry tanker : పుష్ప మూవీలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనాన్ని తరలిస్తున్న సీన్ గుర్తుందా? అదే ప్లాన్‌ను గంజాయి స్మగ్లర్లు ఇక్కడ అమలు చేశారు. కాకపోతే పోలీసులకు అడ్డంగా బుక్కైపోయారు. కుమురం భీం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్‌ను ఒక్కసారిగా గుర్తుచేసింది.
ఏపీ నుంచి మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా : వివరాల్లోకి వెళ్తే కుమురం భీం జిల్లా వాంకిడి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గురువారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీగా గంజాయి పట్టుబడింది. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న ట్యాంకర్ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపి కంప్లీట్‌గా తనిఖీ చేశారు.
290 కేజీల గంజాయి సీజ్ : వాహనం ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరల్లో 290 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.72.50లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గంజాయి తో పాటు రెండు మొబైల్ ఫోన్లు,ఒక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను అరెస్టు చేశామని, ప్రధాని నిందితులను పట్టుకుంటామని ఎస్పీ వివరించారు. గంజాయిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
పెద్ద ఎత్తున అక్రమ రవాణా : ఆంధ్రా, ఒడిశా రాష్ట్ర సరిహద్దు నుంచి రోడ్డు, రైలు మార్గంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేస్తున్నారు. తనిఖీలు విస్తృతం కావడంతో అక్రమార్కులు పోలీసుల కంటిలో పడకుండా ఏదో రూపంలో యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే కొనుగోలు చేసి అనామకులతో రవాణా చేయిస్తూ బడా స్మగ్మర్లు లక్షల్లో పొగేస్తున్నారు. పట్టుబడితే అనామకులే బలవుతున్నారు తప్ప పెద్దవారు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకట్టడికి పోలీసుశాఖ ఎన్నో చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపుతోంది.
భద్రాద్రి కొత్తగూడెంలో డ్రగ్స్ ముఠా అరెస్ట్ - రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం