KTR Answers In Twitter With Public Questions : ప్రస్తుత రాజకీయాలు ఏమాత్రం బాగాలేవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్' వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ (#ఆస్క్ కేటీఆర్) పేరుతో నెటిజన్లతో ఆయన ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
‘‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన రోజూ మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 2025 తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి విస్తృతంగా రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ఆయన సమయం ఇస్తున్నారు. ఓ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కేసీఆర్ సమయం ఇస్తున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయాం" అని కేటీఆర్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ప్రజల్లో తప్పుడు ఆశలను రేకెత్తించాయి. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కారు ప్రజలకు చేసిన మంచి అంటూ ఏమీ లేదు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టం. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండేవిధంగా చేస్తాం' అని నెటిజన్లకు తెలిపారు.
ప్రజల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నా : "ప్రస్తుత రాజకీయాల్లో ఫ్యామిలీ మెంబర్లను సైతం వదలడం లేదు. పాలిటిక్స్‌లోకి వారిని ఎందుకు లాగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మేం అధికారంలోనున్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు. నా 18 ఏళ్ల ప్రజా జీవితంలో నా ఫ్యామిలీ మెంబర్లు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒక దశలో పాలిటిక్స్ నుంచి వైదొలగాలని అనుకున్నాను. కానీ ప్రజల కోసం నిలబడి పోరాడాలని నిర్ణయించుకున్నాను’' అని నెటిజన్లు అడిగిన మరో ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
KTR Comments HYDRA : బిల్డర్లు, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికే హైడ్రా ఉపయోగపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. పేదలు, మధ్యతరగతిని టార్గెట్ చేస్తున్నారు తప్ప బడాబాబులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. మూసీ ప్రాజెక్టు రూపంలో దేశంలోనే పెద్ద కుంభకోణానికి రంగం సిద్ధమవుతోందని విమర్శించారు.
గ్రూప్-1 తరహాలోనే గ్రూప్-4 అభ్యర్థులకు కూడా అండగా నిలుస్తామని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చేలా ప్రయత్నిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో స్థానిక ప్రభుత్వం లేదని దిల్లీ నుంచే పాలన సాగుతోందని ఆరోపించారు. దిల్లీ కోసం దిల్లీ చేత దిల్లీకి అన్నది కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ప్రవచనాలకు పరిమితం కారాదు : పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ ప్రవచనాలకు పరిమితం కారాదని కేటీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య అవగాహన సిగ్గుచేటని మండిపడ్డారు. రెండు దఫాలు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతితో ఎన్నికల్లో ఓడిపోయామని, కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజల్లో తప్పుడు ఆశలు రేకెత్తించడం ప్రధాన కారణమని తెలిపారు.
ప్రస్తుత రాజకీయాలు ఏ మాత్రం బాగాలేవన్నది వాస్తవమని, ఈ పరిస్థితిని కూడా అధిగమిస్తామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించడం ఏ మాత్రం సరికాదని కేటీఆర్ అన్నారు.
దిల్లీకి మూటలు పంపేందుకు మూసీపై సీఎం ప్రేమ చూపిస్తున్నారు : కేటీఆర్
' రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు మేం అడ్డంగా నిలబడతాం - హైదరాబాద్‌లో పేదలకు అండగా ఉంటాం'