RTC Special Buses For Shrine in Karthika Season : కార్తీక మాసం వేళ కుటుంబసభ్యులతో కలిసి ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలకు బస్సు సౌకర్యం కల్పించనుంది. ఈ మేరకు ఖమ్మం టీజీఎస్ ఆర్టీసీ ఆర్‌ఎం సరిరాం మీడియాతో వెల్లడించారు. ఖమ్మంలోని ఆర్టీసీ కార్యాలయంలో బుధవారం డిపో మేనేజర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, గ్యారేజీ ఇన్‌ఛార్జిలు, గ్రామీణ బస్సు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అరుణాచలం, పంచారామాలు అన్నవరం, శబరిమల పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఆర్‌ఎం సరిరాం తెలిపారు. 30-40 మంది భక్తులు ఉంటే వారు అడిగిన తేదీల్లో కూడా పుణ్యక్షేత్రాలకు బస్సులు సమకూర్చుతామని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తామని, టికెట్ల బుకింగ్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని అన్ని డిపోల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పుణ్యక్షేత్రాలకు వెళ్లే బస్సులు వివరాలు
- అన్నవరానికి నవంబరు 3, 10, 14, 17, 24 తేదీల్లో భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు బస్టాండ్ల నుంచి బస్సులు బయల్దేరుతాయి.
- పంచారామ క్షేత్రాలైన అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలకు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో భద్రాచలం, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు డిపోల బస్‌స్టేషన్ల నుంచి బస్సులు నడుస్తాయి.
- అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కోకసం శబరిమల వెళ్లేందుకు అన్ని బస్‌డిపోల నుంచి అద్దె ప్రాతిపదికన సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తాయి.
- తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన, వేలూరు గోల్డెన్ టెంపుల్ పుణ్యక్షేత్రాల దర్శనానికి నవంబరు 13న రాత్రి బస్సులు బయల్దేరి తిరిగి 16న ఉదయం అన్ని బస్ డిపోలకు చేరుకుంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని, ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ సంప్రదించి సీట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో UPI పేమెంట్స్ - ఇకపై అది ఫోన్లో చూపించినా నో ప్రాబ్లమ్
ప్రయాణికులపై 'ప్రత్యేక' భారం - పండుగ వేళ టికెట్ల రేట్లు పెంచేసిన టీజీఎస్ఆర్టీసీ