Cyber Criminals Looted Rs.3 crore From a Doctor : సైబర్ మోసగాళ్లు ఎవరినీ వదలడంలేదు. విశ్రాంత ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు, గృహిణులు ఇలా ఏ వర్గాన్ని వదలకుండా మాయమాటలతో వంచిస్తున్నారు. ఇటీవల ఓ వైద్యురాలికి మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉందని బెదిరించి దశల వారీగా రూ.3 కోట్లు కొట్టేశారు. ఫోన్ చేసి మాట్లాడిన వ్యక్తులు పోలీసులనే భయంతో కిమ్మనకుండా ఉన్న బాధితురాలు మోసపోయినట్టు గ్రహించి, చివరకు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఆశ్రయించారు. ఇలా ఏదో చోట సైబర్ కేటుగాళ్లు చేతివాటం చూపిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన వైద్యురాలికి ఇటీవల అపరిచితుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. టెలికాం విభాగం అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరిట ఉన్న మొబైల్ నంబర్‌తో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించామని చెప్పుకొచ్చాడు. మరో 2 గంటల్లో మొబైల్ నెంబర్ బ్లాక్ చేస్తామంటూ చెప్పాడు. దిల్లీలోని కొందరితో కలిసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయంటూ బెదిరించాడు. ఈ ఆరోపణలు వైద్యురాలు ఖండించేందుకు ప్రయత్నించే సమయంలోనే స్కైప్ వీడియోకాల్ ద్వారా ఐపీఎస్ అధికారినంటూ.. బాధితురాలితో మాట్లాడాడు. మనీలాండరింగ్‌తో ప్రమేయం ఉన్నట్టు ఆధారాలున్నాయని, ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఉత్తర్వులున్నాయంటూ చూపాడు.
ఆర్బీఐ పరిశీలన తర్వాత నగదు తిరిగి చెల్లిస్తామంటూ బురిడీ : బ్యాంకు ఖాతా, డిపాజిట్ల వివరాలు ఇవ్వకుంటే ఆమె భర్త, కుమారుడు ప్రమాదంలో చిక్కుకుంటారంటూ భయపెట్టారు. దర్యాప్తులో భాగంగా ఆమె బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలించాలంటూ ఆర్బీఐ పేరిట నకిలీ ఉత్తర్వులు చూపి నమ్మించారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా తాము సూచించిన అకౌంట్లలో జమ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. జాతీయభద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి బయటి వ్యక్తులతో ఈ విషయాలు పంచుకోకూడదని షరతు విధించారు. ఆమె భర్త, కుమారుడి బ్యాంకు ఖాతా, ఉద్యోగం, ఆదాయం తదితర వివరాలు సేకరించారు.
బ్యాంకు ఖాతాల్లోని నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉపసంహరించి ఆమెతో అక్టోబర్ 14 నుంచి 23 వరకు దఫ దఫాలుగా 3కోట్లు మోసగాళ్లు తమ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకున్నారు. ఆర్బీఐ పరిశీలన పూర్తయ్యాక 3 రోజుల తర్వాత డబ్బంతా తిరిగి ఆమె బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామంటూ నమ్మబలికారు. ఇచ్చిన గడువు ముగియడం, నగదు జమకాకపోవడం చూసి మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీపావళి ఆఫర్ల పేరుతో మీ ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? - తస్మాత్ జాగ్రత్త
అలాంటి రీల్స్ చూస్తున్నారా? - ఐతే బీ కేర్‌ఫుల్ - వాళ్లకు దొరికితే నిండా మునగడం ఖాయం!