Kapila Theertham Kapileshar Temple : కపిల తీర్థం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రం, పుణ్యతీర్థం. ఈ ఆలయంలోని శివలింగం కపిల ముని ప్రతిష్టించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ శివుడు కపిలేశ్వరుడుగా పిలువబడుతూ పూజలందుకుంటున్నాడు.
స్థల పురాణం
ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.
సుందర జలపాతాలు ప్రశాంత వాతావరణం
తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనకు కపిలతీర్థం దర్శనమిస్తుంది. ఇక్కడి సుందరమైన జలపాతం చూపరులను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు, ప్రశాంత వాతావరణం లో పరమశివుని దర్శనం అత్యంత మనోహరం అనిర్వచనీయం.
కపిలతీర్థం
ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయండంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ కొండల మీద నుంచి దాదాపు 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకి ప్రవహించే ఆకాశగంగను కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు.
జలపాతంలో పవిత్ర స్నానాలు
కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వలన ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. కొంతమంది నేరుగా ఆకాశగంగా కిందనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి జలపాతం ఎంత సుందరమైనదో అంతే ఉద్ధృతమైనది. నేరుగా ఈ జలపాతం కింద శిరస్సును ఉంచి, స్నానం చేసిన వారికీ ఆ జలపాతం తాలూకు హోరు కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. ఆ అనుభూతిని ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాలి కానీ ఒకరు చెబితే తెలిసేది కాదు.
ఆలయ చరిత్ర
ఇక కపిల తీర్థం ఆలయ చరిత్రను పరిశీలిస్తే 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
నమ్మాళ్వార్ ఆలయం
ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే, అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చారు. అందుకే కపిలతీర్థం ఆలయంలోనికి ప్రవేశించే ముందుగా మనకు నమ్మాళ్వార్ అనే ఆళ్వారు గుడి దర్శనమిస్తుంది. భక్తులు ముందుగా ఇక్కడ దర్శనం చేసుకున్న అనంతరం శివుని దర్శనం కోసం వెళతారు.
దేవదాసి ప్రతిష్ఠిత వినాయకుడు
అలాగే పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేయడం సహా, అందులోనే వినాయకుడిని కూడా ప్రతిష్ఠించిందట.
ఎన్నో ఉపాలయాలు
కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు.
కపిల తీర్థంలో జరిగే పూజా విశేషాలు
పరమపవిత్రమైన కపిలతీర్థ క్షేత్రం నిత్య పూజలతో ధూపదీప నైవేద్యాలతో భక్త జనసందోహంతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. తిరుమల దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా కపిల తీర్థాన్ని దర్శించుకుంటారు. ఇలా నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే ఈ ఈ తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే!
ముల్లోకాల సకల తీర్థాలు ఇక్కడే!
కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు నాలుగు గంటలపాటు కపిల తీర్థంలోకి వచ్చి చేరుతాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. స్నానమాచరించిన తర్వాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీక మాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు.
నిత్య స్నానాలు, ధూపదీపాలు
నిత్యం ఈ తీర్థంలో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. అంతేకాకుండా శివుడికి ప్రీతికరమైన ఆరుద్రా నక్షత్రం రోజున ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి. మరి విశేషంగా కార్తీకంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి. ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలూ, మాఘమాసంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు.
అన్నాభిషేకం
కపిల తీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు శివుడికి ప్రత్యేకంగా అన్నాభిషేకం జరుగుతుంది. ఈ ఉత్సవం కళ్లారా చూసి కొంచెం అన్నాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఎలాంటి రోగాలైన పోతాయని, సమస్త పాపాలు నశించిపోతాయని భక్తుల విశ్వాసం.
గంధం చీరలో దర్శనమిచ్చే కామాక్షి
అలాగే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇక్కడ కామాక్షి అమ్మవారికి గంధం చీర కడతారు. అమ్మవారిని గంధం చీరలో దర్శనం చేసుకున్న వారికి సకల అభీష్టాలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.
పరమ పవిత్రమైన ఈ కపిలతీర్థ దర్శనాన్ని మనం కూడా చేసుకుందాం. సాధారణంగా తిరుమల దర్శనానికి వెళ్లే వారు తప్పకుండా కపిల తీర్థాన్ని కూడా దర్శించుకుంటారు. కపిల తీర్థం దర్శనం సర్వ పాప హరణం, సమస్త దుఃఖ హరణం. అంతే కాదు భక్తుల పాలిట కల్పవృక్షంగా భావించే ఈ కపిల తీర్థాన్ని మనం కూడా దర్శించుకుందాం. శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుదాం.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.