Significance of Peepal Tree in Hinduism : హిందూ పురాణాల ప్రకారం ప్రకృతిలోని చెట్లు పుట్టలు కూడా దైవ సమానులే. అలాంటి వాటిల్లో ఒకటి రావిచెట్టు. ఈ చెట్టును భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అందుకే దాదాపు ప్రతి గుడిలోనూ రావిచెట్టు ఉంటుంది. పురాణేతిహాసాల్లో కూడా రావిచెట్టుకు మంచి ప్రాధాన్యత ఉంది. మరి.. రావిచెట్టును(Peepal Tree) పూజించడం వెనుక ఉన్న కారణాలేంటి? హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం.. రావిచెట్టును పూజించడం వెనుక అనేక విషయాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయంలో రావిచెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల హనుమంతుడు(Lord Hanuman) ఆశీర్వదించి తమ కోర్కెలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.
విష్ణువు ప్రతిరూపం : హిందూ పురాణాలలో రావిచెట్టును అత్యంత పవిత్రమైనదిగా భావించడానికి మరొక కారణం ఏమిటంటే.. ఈ వృక్షం విష్ణువు మరొక రూపంగా పరిగణిస్తారు. అందుకే.. ఈ చెట్టుకు శ్రేష్ఠదేవ వృక్షం అనే పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు.. పద్మ పురాణంలో రావిచెట్టుకు నమస్కరించి, ప్రదక్షిణలు చేసిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని తెలిపారు.
'రావి ఆకుపై శ్రీరామ నామం రాస్తే ధనలాభం!'- వాస్తు నిపుణులు చెప్పిన మరికొన్ని సలహాలు మీకోసం
త్రిమూర్తుల నివాసం : హిందూ పురాణాల ప్రకారం.. రావిచెట్టును త్రిమూర్తులకు ప్రతిరూపంగా చెప్పుకుంటారు. అందుకే.. బోధి చెట్టును నాటి కాపాడంతో పాటు, స్పర్శించి, విశ్వాసంతో, నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా భక్తులకు సంపద, స్వర్గం, మోక్షం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.
శని దోష నివారణ : హిందూ సంప్రదాయం ప్రకారం.. రావిచెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయట. అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రావిచెట్టు కింద దీపం వెలిగించడానికి శనివారం మంచి రోజుగా పరిగణిస్తారు. ముఖ్యంగా గ్రహదోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని వల్ల సమస్యలు తలెత్తే వాళ్ళు ఆ రోజు దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. అలాగే.. రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు, పూజలు చేస్తే అనేక దోషాలు, సమస్యలు తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.
ఔషధ విలువలకు నిలయం : ఈ చెట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. మూర్ఛ, విరేచనాలు, జీర్ణ సమస్యలు వంటి వివిధ రోగాల చికిత్స కోసం ఈ చెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారని చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు హిందూ పురాణాలు, కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.