Hidimba Devi Temple History : మన దేశ సంస్కృతి ఎంత గొప్పదంటే- దేవతలతో పాటు, కొన్ని చోట్ల మానవ మాత్రులను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించి పూజించే ఆచారం ఒక్క మన దేశంలోనే ఉందని చెప్పవచ్చు. అలాగే రాక్షసులకు కూడా గుడి కట్టి పూజించడం ఒక్క భారతదేశంలోనే చూస్తాం. ఓ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందని తెలుసా! ఈ ఆలయం వివరాల్లోకి వెళ్లిపోదాం.
కీకారణ్యంలో అతి ప్రాచీన ఆలయం
దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలీలోని ఈ ప్రాచీన దేవాలయంలో పూజలందుకునే దైవం పేరు హిడింబ దేవి. సూర్యకిరణాలు సైతం పడని దట్టమైన అడవిలోఉన్న ఈ ఆలయంలో వెలసిన హిడింబ దేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. భక్త జన సందోహంతో ప్రతినిత్యం సందడిగా ఉండే ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే?
స్థలపురాణం
కవిత్రయంగా పేరొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన మహాభారతం ప్రకారం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో కొద్ది రోజులు బస చేశారట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో రాక్షస జాతికి చెందిన హిడింబాసురుడు, హిడింబ అనే అన్నాచెల్లెళ్లు ఉండేవారు. హిడింబాసురుడు పాండవుల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. ఈ హిడింబాసురుడు గొప్ప బలశాలి. అన్న అంటే పంచప్రాణాలు పెట్టే హిడింబ తన అన్నను యుద్ధంలో ఓడించిన వారినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.
భీమునిపై మనసుపడ్డ హిడింబ
నిద్రిస్తున్న పాండవులకు కాపలాగా ఉన్న భీముని చూసి మనసు పడ్డ హిడింబ తన అన్న హిడింబాసురుని వల్ల పాండవులకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది. అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి తెలిపి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది.
భీముని షరతు
హిడింబను వివాహం చేసుకునే ముందు భీముడు ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, ఇక్కడ ఉన్నత కాలం మాత్రమే హిడింబతో ఉండగలనని షరతు విధిస్తాడు. అందుకు హిడింబ అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది.
ఘటోత్కచుని జననం
భీమునికి, హిడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. అనంతరం పాండవులు అక్కడ నుంచి వెళ్ళిపోయాక హిడింబ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోతుంది. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి వీరమరణం పొందుతాడు ఘటోత్కచుడు.
ధర్మానికి కట్టుబడ్డ రాక్షసులు
హిడింబ, ఘటోత్కచుడు పేరుకు రాక్షసులైనా ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ధర్మం వైపు నిలబడడం వల్ల వారిని కూడా దేవతల్లాగానే కొలుస్తున్నారు.
హిడింబ ఆలయ విశేషాలు
మనాలిలో ప్రస్తుతం ఉన్న హిడింబ ఆలయాన్ని 1553లో మహరాజా బహదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
బలి సంప్రదాయం
హిందూ సంస్కృతిలో భాగంగా కనిపించే బలి ఆచారం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అందుకు నిదర్శనంగా హిడింబ ఆలయంలో అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి.
పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ
మనాలీకి హృదయంగా భావించే ఈ ఆలయం మనాలీ పర్యటకులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ప్రేమించిన వారితో వివాహం
భీముని ప్రేమించి అతనినే వివాహం చేసుకున్న హిడింబ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిగేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇంకెందుకు ఆలస్యం! ప్రేమించిన వారితో వివాహం జరగాలని కోరుకునే వారు ఈ ఆలయాన్ని దర్శించండి మీ కలలు నిజం చేసుకోండి. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.