Chandra Dosha Nivarana Mantra In Telugu : వరాహ మిహిరుడు, ఆర్యభట్ట రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే, అవి పోగొట్టుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలను నివారించడానికి, ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించడానికి, జాతకంలో చంద్ర దోష నివారణకు ప్రతి సోమవారం శివ పూజ చేయాలని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.
సోమవారం శివోహం!
హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవారం శివుని ఆరాధనకు శ్రేష్టం. ఈ రోజు శివుడిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తే జీవితంలో ఏర్పడే కష్ట నష్టాలు, ప్రమాదాలు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా జాతకంలో చంద్ర దోషం కారణంగా ఏర్పడే మానసిక సమస్యల నివారణకు ప్రతి సోమవారం నెలవంకను శిరస్సున ధరించిన శివయ్యను నియమనిష్టలతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం .
సోమవారం శివపూజకు నియమాలు
చంద్ర గ్రహ దోషం కారణంగా ఇబ్బందులు పడేవారు సోమవారం ఉదయాన్నే తలారా స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని సమీపంలోని శివాలయానికి వెళ్లాలి.
శివాలయంలో పూజ
శివాలయంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయాలి. ఆవుపాలతో అభిషేకించిన తరువాత గంగాజలంతో కూడా అభిషేకించాలి. అనంతరం శివలింగాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. తెల్లని మల్లెపూలు, జాజిపూలు, నంది వర్ధనాలతో శివయ్యని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. కొబ్బరికాయ కొట్టి, కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి.
ఈ దానాలు శ్రేష్టం
సోమవారం పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేస్తే చంద్ర గ్రహ దోష నివారణ అవుతుంది. అలాగే శివాలయంలో పూజారికి ఒక పళ్లెంలో తెల్లని వస్త్రాన్ని ఉంచి దానిపై బియ్యం పోసి, వెండితో తయారు చేసిన చంద్రబింబ ప్రతిమను దక్షిణ తాంబూలాదులతో సహా దానం చేస్తే జన్మ నక్షత్రం ప్రకారం చంద్రుని స్థానం బలపడుతుంది. మానసిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి.
పంచాక్షరీ జపం
ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని సోమవారం నాడు 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి స్వాంతన చేకూరుతుంది.
ప్రసాద పంపిణీ
సోమవారం శివునికి బియ్యం, పాలు, పంచదారతో చేసిన పాయసాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని అందరికి పంచిపెడితే మానసిక ప్రశాంతత కలిగి చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఇలా 11 సోమవారాలు శివున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తే చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు, సిరి సంపదలు చేకూరుతాయి.
ఓం నమః శివాయ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాలలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.