Arunachalam Giri Pradakshina Timings Telugu : తలచినంత మాత్రముననే సకల పాపాలను పోగొట్టే మహా పుణ్యక్షేత్రం అరుణాచలం. "అరుణాచలం" అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ. అంటే ఎర్రని కొండ అని అర్థం. ఇది చాలా గొప్ప పుణ్య క్షేత్రము. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రము. ఈ క్షేత్రం కాశీ, చిదంబరముల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం.
శివుని ఆజ్ఞతో నిర్మించిన క్షేత్రం
అరుణాచలం వేద, పురాణాలలో పేర్కొన్న క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించాడని, దాని చుట్టూ అరుణమనే పురము కూడా నిర్మించినట్లుగా పురాణాలు తెలుపుతున్నాయి. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలోని అరుణాచల మహాత్మ్యంలో వివరించిన ప్రకారం అరుణాచలంలో జరుగవలసిన పూజా విధానమంతా శివుని ఆజ్ఞ ప్రకారం గౌతమ మహర్షి నిర్దేశించినట్లుగా తెలుస్తోంది.
అరుణ గిరియే పరమశివుడు
వాస్తవానికి అరుణాచలంలో ఉన్న ఈ కొండయే శివుడని పురాణముల ద్వారా స్పష్టం అవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరుని ఆలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అంటారు. కొందరు ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగమని కూడా అంటారు.
తేజోలింగం - అగ్నిలింగం
అరుణాచలంలోని శివలింగం తేజోలింగము కనుక దీనిని అగ్ని క్షేత్రమంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము చేయడమే అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం గర్భాలయంలోకి ప్రవేశించగానే ఆలయం బయటకు, గర్భాలయం లోపలకు ఉషోగ్రతలో ఉన్న తేడా భక్తులకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ శివలింగం అగ్ని లింగం కాబట్టి గర్భాలయంలో లోపల వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే శ్రీకాళహస్తిలో వాయులింగమైన శివలింగం నుంచి వచ్చే గాలి కారణంగా దీపం కదులుతూ ఉంటుందో అదే అనుభవం అరుణాచలం గర్భాలయంలో భక్తులకు కలుగుతుంది.
గిరిప్రదక్షిణ
అరుణాచలంలో శివ దర్శనం కన్నా గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే అరుణ గిరియే సాక్షాత్తూ పరమశివుడనే భావం ఉండడం చేత భక్తులు పాదచారులై గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ విధంగా శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాదిమంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక శ్రావణ పౌర్ణమి, కార్తిక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలలో ఇక్కడ దేశవిదేశాల నుంచి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు.
ఔషధుల నిలయం అరుణగిరి
అరుణగిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివ స్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ గిరి ప్రదక్షిణకు అంతటి ప్రాశస్త్యం.
గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి
గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. పగటిపూట సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. లేదా మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు పెడితే రాత్రి 8 గంటల లోపు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది.
గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి
రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. సాధారణంగా గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచే మొదలు పెట్టి అరుణాచలేశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నాక ముగిస్తారు.
గిరి ప్రదక్షిణ వలయంలో చూడవలసిన విశేషాలు
గిరి ప్రదక్షిణ వలయంలో తప్పకుండా చూడవలసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ స్వామి కొండ చుట్టూ అష్ట దిక్పాలకులు ఉంటారని ప్రతీతి. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వలయంలో ముందుగా ఇంద్ర లింగం దర్శించాలి. తర్వాత వలయంలో క్రమంగా అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం ఇలా అన్నింటిని దర్శించుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తేనే ప్రదక్షిణ ఫలం దక్కుతుందని విశ్వాసం. ముఖ్యంగా ప్రదక్షిణ వలయంలో వచ్చే ఆది అన్నామలై ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి.
పృథ్వి బంగారు ముఖ దర్శనం
రమణాశ్రమానికి 2 కిలోమీటర్లు దూరం వెళ్లిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో ఉన్న వినాయకుడి గుడి నుంచి అరుణ గిరిని దర్శిస్తే ఆ కొండ నంది లాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అరుణ గిరిని దర్శిస్తే పేదరికం పోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
మోక్ష సాధనం - ఆకాశదీప దర్శనం
కార్తిక పౌర్ణమి రోజున అరుణాచల గిరి పైన ఆకాశదీపము వెలిగిస్తారు. ఈ కార్తిక పౌర్ణమి దీపోత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి కొన్ని లక్షలమంది అరుణాచలానికి చేరుకుంటారు.
విదేశీయులు శాశ్వత నివాసం
అరుణాచలంలో ఎంతో మంది విదేశీయులు శాశ్వత నివాసం ఏర్పరుచుకుని శివుని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రశాంతత, దివ్యశక్తి భక్తులలో ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తుంది.
రమణాశ్రమం
అరుణాచలంలో చూడవలసిన మరొక ముఖ్య విశేషం రమణ మహర్షి ఆశ్రమం. అరుణాచలేశ్వరుని భక్తుడైన రమణుల వారు తన చిన్నతనంలోనే ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలమునకు వచ్చి అక్కడే స్వామిని గురించి తపస్సు చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహానుభావుడు. తదనంతరం అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించి ఎందరినో తరింప చేసిన మహానుభావులు రమణుల వారు. రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమం తప్పకుండా సందర్సించాలి. విశేషమేమిటంటే ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చెసే ప్రార్థన చాలా బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. నెమళ్ళు కూడా స్వేచ్ఛగా తిరుగుతూంటాయి. అక్కడ గ్రంథాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి.
శేషాద్రి ఆశ్రమం
అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ వలయంలో శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని కూడా దర్శించుకోవాలి. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది.
అతి పురాతనం అతి ప్రాచీనం
అరుణాచలం కొండ నమూనాలను పరీక్షించిన పురావస్తు శాఖ అధికారులు ఇది కొన్ని లక్షల సంవత్సరాలకు ముందుదని నిర్ధరించారు. అందుకే దక్షిణ భారతానికే అరుణాచలం తలమానికంగా భావిస్తారు.
అరుణాచల మహత్యం
చివరగా అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, మండుటెండలో, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం నుంచి కూడా దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు భూలోకంలో సూక్ష్మ రూపంలో కానీ పశు పక్ష్యాదుల రూపంలో కానీ అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని విశ్వాసం.
అరుణగిరి ప్రదక్షిణ నియమాలు
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులు పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం, మాంసాహారం, ధూమపానం చేయరాదు. ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి 'అరుణాచల శివ అరుణాచల శివ' అంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ వలయంలో కాఫీ, టీ, ఇతర తినుబండారాలు దొరుకుతాయి. మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోడానికి కాఫీ, టీ తాగవచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు.
భక్తి ప్రధానం
అరుణాచల గిరి ప్రదక్షిణానికి కావాల్సింది ఆ ఈశ్వరుని మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు మాత్రమే! ఏదో కాలక్షేపం కోసమో, ఒక విహార యాత్రకు వెళ్లినట్లుగానో అరుణాచలానికి వెళ్లకూడదు. జీవితంలో ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో 'అరుణాచల శివ' అని స్మరిస్తే చాలు కొండంత పాపరాశి యైన అరుణాచలుని కృపాగ్నిలో ధ్వంసమై పోతుంది.
ఇలా చేరుకోవచ్చు
అరుణాచలం చెన్నై నుంచి 185 కి.మీ. దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుంచి కూడా అరుణాచలమునకు బస్సులు కలవు.
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.