Anantha Padmanabha Swamy Vratham In Telugu : వ్యాస మహర్షి రచించిన మహాభారతంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి ప్రస్తావన ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వారి క్షేమ సమాచారం కనుక్కోవడానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఎదురేగి అతిథి మర్యాదలతో సత్కరించి, ఆసనం వేసి గౌరవించాడు. అనంతరం ధర్మరాజు శ్రీ కృష్ణునితో ఎటువంటి వ్రతం చేసినట్లయితే తమ కష్టాలు తొలగిపోతాయో ఉపదేశించమని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అరణ్యవాసంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోవాలంటే 'అనంత పద్మనాభ స్వామి వ్రతం' చేయమని తెలిపాడు.
ఎవరు ఈ అనంతుడు?
ధర్మరాజు, అనంతుడంటే ఎవరు అని శ్రీ కృష్ణుడిని అడుగుతాడు. దీనికి కృష్ణుడు, 'ఆ పరమాత్మ అనంతపద్మనాభుడు అంటే ఎవరో కాదు నేనే, నేనే కాల స్వరూపుడిగా అంతటా వ్యాపించి ఉంటాను' అని చెప్పాడు. రాక్షసులను సంహరించడానికి తానే కృష్ణుడిలా అవతరించినట్లు, సృష్టి, స్థితి, లయలకు కారణమైన కాల స్వరూపుని రూపంలో ఉన్న పద్మనాభ స్వామి కూడా తానే అని, మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు కూడా తనవే అని చెబుతాడు.
14 భువనాలు ఒకే స్వరూపం
శ్రీకృష్ణుడు ధర్మ రాజుతో తనలోనే చతుర్దశ భువనాలు ఉన్నాయని అందుకే 'అనంత పద్మనాభ స్వామి వ్రతం' ఆచరించమని చెప్పాడు.
అనంత పద్మనాభ వ్రతం ఎప్పుడు?
సెప్టెంబర్ 17వ తేదీ భాద్రపద శుద్ధ పౌర్ణమితో కూడిన చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని జరుపుకోవాలి. పూజ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు చేసుకోవచ్చు.
అనంత పద్మనాభ వ్రత విధానం
ధర్మరాజు కోరికపై శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ వ్రత విధానాన్ని వివరించాడు. అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలి. ముందుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దర్భలతో పద్నాలుగు పడగల అనంతుడిని చేసుకోవాలి తర్వాత గణపతిని, నవగ్రహాలను పూజించిన తర్వాత యమునా పూజ చేయాలి. అనంతుడిని షోడశోపచారాలతో పూజించి 28 అరిసెలు చేసుకుని శ్రీ అనంత పద్మనాభ స్వామికి నైవేద్యంగా నివేదించి, వ్రత కథ చెప్పుకుని అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి, అక్షింతలు తలపై వేసుకోవాలి. 14 అరిసెలు బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చి, మిగిలినవి భక్తితో తినాలి. ఎరుపు రంగులో ఉన్న పద్నాలుగు పొరలతో తయారుచేసుకున్న తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా 14 సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి.
అనంత పద్మనాభ వ్రత ఫలం
14 సంవత్సరాల పాటు అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే భయంకరమైన కష్టాలు తొలగిపోతాయి. కటిక దరిద్రుడు కూడా ఆగర్భ శ్రీమంతుడిగా మారుతాడు.
రానున్న అనంత పద్మనాభ వ్రతాన్ని మనమందరం కూడా జరుపుకుందాం సకల ఐశ్వర్యాలు పొందుదాం.
ఓం నమో నారాయణాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.