Mohini Avatharam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఉదయం మోహినీ అవతారంలో శ్రీనివాసుడు శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆ పక్కనే దంతపు వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా కూడా స్వామి భక్తులను అలరిస్తూ దర్శనమిస్తారు. ముగ్ధమనోహర మోహిని, ఆ వెన్నంటే వెన్నదొంగ కృష్ణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. ఈ సందర్భంగా మోహిని అవతార విశిష్టతను ఈ కథనంలో తెలుసుకుందాం.
జగన్నాటక సూత్రధారి దేవదేవుడు
పోతనామాత్యుడు రచించిన భాగవతం ప్రకారం, క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృతం కోసం దేవదానవులు కలహించుకున్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినీ అవతారంలో అమృత కలశాన్ని చేత పట్టి, రాక్షసులను మాయా మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచి పెట్టారని పురాణగాథ.
ఇందుకే మోహినీ అవతారం
జగన్నాటక సూత్రధారి అయిన ఆ దేవదేవుడు - మాయా మోహానికి లొంగిన ఈ జగత్తు నుంచి తన భక్తుల్ని బయటపడేసేందుకు మోహినీ రూపంలో వాహనారూఢుడై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారని భక్తుల విశ్వాసం. తాత్కాలికమైన మోహావేశాలకు లోను కాకుండా శాశ్వతమైన మోక్షానికి మార్గం సుగమం చేయడమే మోహినీ అవతార పరమార్థం. మోహినీ అవతారంలో తిరుమాడ విధులలో ఊరేగే శ్రీనివాసునికి నమస్కరిస్తూ - ఓం నమో వేంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.